ఏబీఎన్‌ చానల్‌పై నేడు వైఎస్సార్‌ సీపీ శ్రేణుల నిరసన | - | Sakshi
Sakshi News home page

ఏబీఎన్‌ చానల్‌పై నేడు వైఎస్సార్‌ సీపీ శ్రేణుల నిరసన

Apr 8 2026 8:20 AM | Updated on Apr 8 2026 8:20 AM

అమలాపురం టౌన్‌: ఇటీవల ఆంధ్రజ్యోతి (ఏబీఎన్‌) చానల్‌ వైఎస్సార్‌ సీపీ నాయకులపై ప్రసారమైన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో అమలాపురం గడియారం స్తంభం సెంటరులో బుధవారం ఉదయం 9 గంటలకు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌ తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డితోపాటు జిల్లా ముఖ్య నాయకులు హాజరవుతారని పేర్కొన్నారు.

కార్యదర్శుల వేతన శ్రేణిని

సవరించడం దుర్మార్గం

అల్లవరం: గ్రామ పంచాయతీ గ్రేడు–3 కార్యదర్శుల వేతన శ్రేణిని సవరించడం దుర్మార్గమైన చర్య అని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జీఓ 91లో పేర్కొన్న రూ.28,280–89,720 గా ఉన్న వేతన శ్రేణిని రూ. 25,220–80,910 వేతన శ్రేణీగా సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా సచివాలయ ఉద్యోగులకు తీవ్రా అన్యాయం జరుగుతుందని ఇజ్రాయిల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం సచివాలయం వ్యవస్థను నిర్వీర్యం చేయాలని, ఉద్యోగులను ఇబ్బంది పెడుతోందన్నారు. రేషనలైజేషన్‌ పేరిట సచివాలయ ఉద్యోగులను కుదించి, మిగిలిన వారిని వేర్వేరు శాఖలకు బదలాయించడం, తాజాగా కార్యదర్శులు వేతన శ్రేణీని సవరించడం, ఉద్యోగుల పొట్టకొట్టడమేనని ఆక్షేపించారు. ఎన్నికలకు ముందు వలంటీర్లను కొనసాగించి, రూ. 10 వేలు చేస్తామని ఆశలు కల్పించి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాది మంది వలంటీర్లను తొలగించారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయం వ్యవస్థను గ్రామాల్లో ఏర్పాటు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేస్తోందన్నారు.

టెన్త్‌ స్పాట్‌ ఎగ్గొట్టిన టీచర్లకు

షోకాజ్‌ నోటీసులు

అమలాపురం టౌన్‌: పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన విధులకు గైర్హాజరయిన 23 మంది ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు ఇస్తున్నట్టు డీఈవో పి.నాగేశ్వరరావు తెలిపారు. అమలాపురం జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను డీఈవో నాగేశ్వరరావు మంగళవారం పరిశీలించారు. మూల్యాంకన ప్రక్రియ విధులకు హాజరు కాని ఉపాధ్యాయులను గుర్తించి వారికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు డీఈవో నాగేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 6వ తేదీ నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించామని, చీఫ్‌ ఎగ్జామినర్లు, అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, స్పెషల్‌ అసిస్టెంట్స్‌ మొత్తం 23 మంది మూల్యాంకన విధులకు హాజరు కాలేదని డీఈవో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా, కనీస సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరు కావడం క్రమశిక్షణ చర్యల కిందకు వస్తుందన్నారు.

నేటి నుంచివైద్య ఉద్యోగుల నిరసనలు

అమలాపురం టౌన్‌: ఏపీ మెడికల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వైద్య ఉద్యోగులు తమ 29 సమస్యల (డిమాండ్ల) పరిష్కారాన్ని కోరుతూ జిల్లాలో బుధవారం నుంచి దశల వారీ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఏపీ మెడికల్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా కార్యదర్శి పీవీవీ సుబ్బారావు ఈ దశల వారీ నిరసన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్‌ కార్తీక్‌కు యూనియన్‌ నేత సుబ్బారావు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఈ నెల 8వ తేదీ నుంచి జిల్లా వైద్య ఉద్యోగులు చేపట్టనున్న నిరసన కార్యక్రమాలు, తమ డిమాండ్లపై ఇప్పటికే వినతి పత్రం అందించారు.

అమలాపురం, రామచంద్రపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులు, జిల్లాలోని తొమ్మిది ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రులకు చెందిన దాదాపు 200 మంది వైద్య ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. బుధ, గురువారాల్లో (8,9 తేదీల్లో) ఈ రెండు రోజులూ వైద్య ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలుపుతారు. ఈ నెల 10, 11 తేదీల్లో రెండు రోజులూ ఓ గంట సేపు ఆయా ఆస్పత్రుల వద్ద ఉద్యోగులు ధర్నాలు చేయనున్నారు. కాంట్రాక్ట్‌ వైద్య ఉద్యోగులకు నూరు శాతం గ్రాస్‌ జీతం, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఏడాదిలో 35 రోజుల సెలవులు, కనీస వేతనం రూ.28 వేలు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement