ఇంటింతై.. వ్యయమింతై.. | - | Sakshi
Sakshi News home page

ఇంటింతై.. వ్యయమింతై..

Apr 7 2026 7:31 AM | Updated on Apr 7 2026 7:31 AM

ఆలమూరు: పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కల చంద్రబాబు ప్రభుత్వ పాలనలో కలగానే మిగిలిపోతోంది. ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తున్నా జిల్లాలో ఒక్క లబ్ధిదారుడికి కూడా గృహ రుణం మంజూరు చేయలేదు. అర్హులైన ఏ ఒక్కరికీ ఒక్క సెంటు స్థలం కూడా కేటాయించలేదు. ప్రభుత్వం తోడ్పాటు ఇవ్వకపోయినా ఉన్నంతలోనే ఇల్లు కట్టుకుందామనుకుని ఆశ పడుతున్న సామాన్యులకు పశ్చిమాసియా యుద్ధం పిడుగుపాటుగా మారింది. ఈ యుద్ధం నేపథ్యంలో గృహ నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవడం వారి ముందర కాళ్లకు బంధం వేస్తోంది. సిమెంటు, ఐరన్‌ వంటి వాటి ధరలు నెల రోజుల్లోనే 10 నుంచి 30 శాతం వరకూ పెరిగిపోవడంతో గృహనిర్మాణం లబ్ధిదారులకు పెనుభారంగా మారింది.

పశ్చిమాసియా యుద్ధం పేరుతో..

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం చమురు, వంట గ్యాస్‌ వంటి వాటి దిగుమతులు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల పైనే కాదు.. గృహ నిర్మాణంపై కూడా ప్రభావం చూపుతోంది. యుద్ధం ప్రభావం నిజంగా ఏ మేరకు ఉందో తెలియదు కానీ.. దీనిని సాకుగా చూపించి గృహ నిర్మాణాల్లో వినియోగించే సిమెంటు, ఐరన్‌ ధరలను ఆయా కంపెనీలు పెంచేస్తున్నాయి. యుద్ధం నేపథ్యంలో గృహ నిర్మాణ సామగ్రి తయారీలో ఉపయోగించే ముడి సరకు లభ్యత తగ్గిందని కొందరు చెబుతున్నారు. అయితే, కొంత మంది వ్యాపారులు సిండికేట్‌ అయ్యి, కృత్రిమ కొరత సృష్టిస్తూండటం వల్ల కూడా ధరలు పెరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. గృహ నిర్మాణంలో ప్రధానంగా ఉపయోగించే ఇనుము ధర నెల రోజుల క్రితం టన్నుకు రూ.53 వేలు ఉండగా క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం ఏకంగా రూ.78 వేలకు చేరింది. అలాగే, సిమెంటు బస్తా ధర రూ.275 నుంచి రూ.335కు పెరిగింది. మూడు యూనిట్ల మెటల్‌ ధర గతంలో రూ.12 వేలు ఉండగా ఇప్పుడది రూ.18 వేలకు చేరింది. ఒక్కో ఇటుక ధర నాణ్యతను బట్టి రూ.5 ఉండగా ఇప్పుడు రూ.9 పలుకుతోంది. ఇసుక ధరలైతే చెప్పనవసరమే లేదు.

చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ఇసుక అంటూ ఆర్భాటంగా ప్రకటిస్తోందే తప్ప ఆచరణలోకి వచ్చేసరికి ప్రజలకు రూ.వేలు వదిలిపోతున్నాయి. దూరాన్నిబట్టి ఇసుక వ్యయం మరింత పెరుగుతోంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర పలుకుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ధరల పెరుగుదలతో నిర్మాణ వ్యయం మరింత భారమై, సొంతిల్లు కట్టుకోవాలనుకుంటున్న సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు.

కార్మికుల ఆందోళన

గృహ నిర్మాణ రంగం కుదేలవడంతో కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది. తాపీ మేస్త్రులు, జట్టు కూలీలు, సాధారణ కూలీలు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, సీలింగ్‌ చేసేవారు, పెయింటర్లు ఇలా ప్రతి ఒక్కరూ రోజువారీ పనులు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో వీరి సంఖ్య సుమారు 25 వేల వరకూ ఉందని అంచనా. వీరితో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చి, ఇక్కడ భవన నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులు కూడా పనుల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఖర్చు పెరిగిపోతోంది

గృహ నిర్మాణ సామగ్రి ధరలు రోజురోజుకూ పెరుగుతూండటంతో నిర్మాణాలు కష్టసాధ్యంగా ఉన్నాయి. ఇంటి నిర్మాణానికి మొదట్లో అనుకున్న బడ్జెట్‌కు, ప్రస్తుతం అవుతున్న ఖర్చుకు పొంతన లేకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది.

– దాడిశెట్టి అప్పారావు, తాపీ మేసీ్త్ర, ఆత్రేయపురం

గృహరుణాలు మంజూరు చేయాలి

గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులందరికీ రుణాలు మంజూరు చేయాలి. గత సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న మాకు రూ.5 లక్షల చొప్పున కేటాయించాలి. సిమెంటును రాయితీపై సామాన్యులకు అందించాలి.

– తమ్మన శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌,

చెముడులంక, ఆలమూరు మండలం

ధరల పెరుగుదల ఇలా (రూ.లలో)

సామగ్రి నెల క్రితం ప్రస్తుతం

ఇనుము 53,000.00 78,000.00

(టన్ను)

సిమెంటు బస్తా 275.00 345.00

మెటల్‌ 12,000.00 18,000.00

(3 యూనిట్లు)

ఇటుక (1) 5.00 9.00

ఫ 30 శాతం పెరిగిన సామగ్రి ధరలు

ఫ పశ్చిమాసియాలో యుద్ధం సాకుతో

వ్యాపారుల సిండికేటు

ఫ సిమెంటు బస్తాపై రూ.50 పెరుగుదల

ఫ ఐరన్‌ టన్నుకు రూ.20 వేల వరకూ

పెంపు

ఫ ఎక్కడికక్కడే నిలిచిన పనులు

ఫ జిల్లాలో 25 వేల మంది భవన నిర్మాణ కార్మికులకు కష్టాలు

అదే బాటలో ఇతర సామగ్రి

మరోవైపు ఇతర నిర్మాణ సామగ్రి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. గుజరాత్‌ నుంచి జిల్లాకు సరఫరా కావలసిన టైల్స్‌ సక్రమంగా రావడం లేదు. అలాగే, ఇటీవల గుమ్మాలకు, ఫ్లోరింగ్‌కు వుడ్‌కు బదులు ఉపయోగిస్తున్న గ్రానైట్‌, సీలింగ్‌కు ఉపయోగించే జిప్సమ్‌ షీట్ల ధరలు గణనీయంగా పెరిగాయి. జింక్‌ సరఫరా లోపం ప్లాస్టిక్‌ పైపుల తయారీపై తీవ్రంగా పడటంతో ప్రతి పైపునకు చదరపు అడుగుకు రూ.5 నుంచి రూ.40 వరకూ వ్యాపారులు పెంచేశారు. ఇంటీరియర్‌, పెయింట్స్‌, శానిటరీవేర్‌, ప్లంబింగ్‌, కరెంట్‌ సామగ్రి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఇదే అదనుగా ఇప్పటికే నిల్వ ఉన్న సామగ్రి ధరలను సైతం స్థానిక వ్యాపారులు పెంచి విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

గృహ నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవడంతో కొంతమంది నిర్మాణదారులు అప్పులు చేసి పనులు కొనసాగించాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. మరి కొంతమంది నిర్మాణాలను అర్ధాంతరంగా నిలిపివేస్తున్నారు. ఇటువంటి సమయంలో గత సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం గృహ రుణాన్ని రూ.5 లక్షల వరకూ పెంచి అర్హులకు మంజూరు చేస్తే కాస్తయినా ఉపశమనంగా ఉంటుందని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.

04ఆర్‌వీపీ26:

04ఆర్‌వీపీ27:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement