రాజధాని చట్టం పేరుతో భ్రమలు కల్పిస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

రాజధాని చట్టం పేరుతో భ్రమలు కల్పిస్తున్నారు

Apr 7 2026 7:31 AM | Updated on Apr 7 2026 7:31 AM

సాక్షి, అమలాపురం: అమరావతి రాజధాని చట్టం పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను భ్రమల్లో ఉంచుతోందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్య విమర్శించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత మళ్లీ అమరావతి చట్టం పేరుతో కొత్త నాటకానికి తెర తీసిందని ధ్వజమెత్తారు. అమలాపురంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు ఏడేళ్ల పాలనలో అమరావతిలో ఐదారు భవనాలు నిర్మించి, దానినే రాజధాని అని పిలవడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. దీనికి భిన్నంగా వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన మావిగన్‌ (మచిలీపట్నం – విజయవాడ – గుంటూరు) గ్రోత్‌ ఇంజిన్‌ కారిడార్‌ ద్వారా రాజధాని, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. తక్కువ ఖర్చుతో, ఇప్పటికే ఉన్న పోర్ట్‌, ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్ల అనుసంధానంతో సుమారు 60 లక్షల మంది ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అమరావతి పేరుతో రూ.లక్షల కోట్ల అప్పులు చేసి భవిష్యత్తు తరాలపై భారం మోపాల్సిన అవసరముండదని ఆదిత్య తెలిపారు. 2028 నాటికి రాజధాని పూర్తి చేస్తామన్న చంద్రబాబు, ఇప్పుడు అది నిరంతర ప్రక్రియని చెప్పడం మోసం చేయడమేనని విమర్శించారు. వాస్తవానికి జగన్‌, వైఎస్సార్‌ సీపీ అమరావతికి వ్యతిరేకం కాదని, అక్కడ జరుగుతున్న దోపిడీకే వ్యతిరేకమని పేర్కొన్నారు.

వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం

అమలాపురం టౌన్‌: కోనసీమ వంటి డెల్టా ప్రాంతాల్లో డంపింగ్‌ యార్డుల నిర్వహణకు స్థలాల కొరత ఉన్నచోట్ల పెరుగుతున్న వ్యర్థాల సమస్యకు ప్లాస్మా టెక్నాలజీ శాశ్వత పరిష్కారమని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ అన్నారు. అమలాపురం మున్సిపాలిటీ డంపింగ్‌ యార్డ్‌ను ఆయన సోమవారం సందర్శించారు. ప్లాస్మా టెక్నాలజీతో తడి, పొడి చెత్తను వేరుగా ప్రాసెసింగ్‌ చేసే యూనిట్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ యూనిట్‌ నిర్మాణం 15 రోజుల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. అక్కడ తక్షణమే ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయాలని ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ బి.రాజేశ్వరిని ఆదేశించారు. ఈ విధానం 95 శాతం వరకూ చెత్త పరిమాణాన్ని తగ్గిస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ వి.నిర్మల్‌కుమార్‌, తహసీల్దార్‌ వీఎస్‌ దివాకర్‌, మున్సిపల్‌ ఏఈ వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి

పవర్‌ లిఫ్టింగ్‌లో స్వర్ణం

రాయవరం: మండలంలోని నదురుబాద గ్రామానికి చెందిన విత్తనాల ముత్యాలరావు (ముత్తు) రాష్ట్ర స్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో స్వర్ణ పతకం కై వసం చేసుకున్నాడు. ఈ నెల 4, 5 తేదీల్లో విజయనగరం జిల్లా రాజాం జీఎంఆర్‌టీ కళాశాలలో ఏపీ పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన ఈ పోటీలు జరిగాయి. మాస్టర్స్‌ కేటగిరీ విభాగంలో ఆయన ఈ ఘనత సాధించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ముత్తు గోల్డ్‌ మెడల్‌ సాధించడం పట్ల ఏపీఓ జె.సుధారాణి, ఫీల్డ్‌ అసిస్టెంట్లు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement