అమలాపురం రూరల్: రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడానికి కృషి చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బ్లాక్‌స్పాట్లను గుర్తించి స్ట్రిప్స్, సోలార్ సిగ్నల్స్, సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను తగ్గించాలని సూచించారు. జాతీయ రహదారులు, గ్రామీణ రోడ్లు కలిసే చోట స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమలు చేయాలన్నారు. అతి వేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్, సీట్ బెల్ట్ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రతి రోడ్డు ప్రమాదాన్నీ విశ్లేషించి, కారణాలు తెలుసుకోవాలని, బ్లాక్‌స్పాట్లు గుర్తించాలని అన్నారు. అత్యవసర సేవలకు అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని, ట్రామాకేర్ సెంటర్లలో సౌకర్యాలు, తక్షణ చికిత్స అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రోడ్లకు మరమ్మతులు, గుంతల పూడ్చివేత, స్ట్రీట్ లైటింగ్, పాదచారుల కోసం జీబ్రా క్రాసింగ్‌లు, ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేయాలన్నారు. జొన్నాడ ఫ్లైఓవర్ బ్రిడ్జి, సర్వీసు రోడ్ల పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ రాహుల్ మీనా, జాతీయ రహదారుల విభాగం ప్రాజెక్టు డైరెక్టర్ బి.కృష్ణమూర్తి జిల్లా రవాణా అధికారి డి.శ్రీనివాసరావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ బి.రాము, జాతీయ రహదారుల ఏఈ వెంకట రమణ డీసీహెచ్‌ఎస్ కార్తీక్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి దుర్గారావుదొర, డీపీఓ శాంతిలక్ష్మి, అమలాపురం మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జలవనరుల పరిరక్షణకు కార్యాచరణ
అమలాపురం రూరల్: నీటి సంరక్షణ–జలవనరుల పరిరక్షణకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జలవనరులు, గ్రామీణ నీటి సరఫరా, డ్రైనేజీ, డ్వామా, భూగర్భ జల శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగునీటి సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వంద రోజుల ప్రణాళిక రూపొందించాలని అన్నారు. సమావేశంలో జలవనరుల శాఖ ఎస్‌ఈ భక్తులు వెంకట రమణ, ఈఈ వెంకటేశ్వరరావు, డ్రైనేజీ విభాగం ఈఈ ఎన్‌వీ కిషోర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఏవీఎస్ రాజన్, డీఆర్‌డీఏ పీడీ డి.రాంబాబు, డీఎల్‌డీఓలు పాల్గొన్నారు.


