మండుటెండ నుంచి ఉపశమనం | - | Sakshi
Sakshi News home page

మండుటెండ నుంచి ఉపశమనం

Apr 7 2026 7:31 AM | Updated on Apr 7 2026 7:31 AM

సాక్షి, అమలాపురం: మండుటెండ నుంచి ఉపశమనం కలిగించేలా జిల్లాలో సోమవారం పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం 11 గంటల సమయంలో గంటపాటు ఏకధాటిగా వర్షం పడింది. అంతకు ముందు దట్టమైన మేఘాలు కమ్ముకుని చల్లని గాలులు వీస్తూ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. వారం రోజులుగా భానుడి తీక్షణతతో అల్లాడుతున్న సామాన్యులు మారిన వాతావరణంతో సేద తీరారు. అమలాపురం, అంబాజీపేట, ముమ్మిడివరం, ఐ.పోలవరం, అయినవిల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. అమలాపురం పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లపై నీరు చేరింది. ఈదరపల్లి వంతెన సమీపాన రిలయన్స్‌ పెట్రోల్‌ బంకు వద్ద రెండడుగుల ఎత్తున నీరు చేరడంతో వాహన చోదకులు, స్థానికులు ఇబ్బంది పడ్డారు. అమలాపురం – బొబ్బర్లంక రోడ్డులో బండారులంక, కె.పెదపూడి, పుల్లేటికుర్రు వద్ద పలుచోట్ల రోడ్ల మీద నీరు చేరింది. ఐ.పోలవరం మండలం మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే రహదారి నీట మునగడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షం వల్ల వరితో పాటు వ్యవసాయ, ఉద్యాన పంటలకు మేలు జరిగింది. ఆత్రేయపురం, కొత్తపేట, రావులపాలెం, ఆలమూరు మండలాల్లో వరి కోతలకు కొంత అంతరాయం ఏర్పడింది. ఇక్కడ ఇప్పుడిప్పుడే రబీ వరి కోతలు మొదలైన విషయం తెలిసిందే. శివారు చేలకు మాత్రం ఈ వర్షం చేసిన మేలు అంతా ఇంతా కాదు. అలాగే, పైరును ఆశించిన దోమపోటు ఉధృతి కూడా తగ్గుతుందని రైతులు చెబుతున్నారు. ఉద్యాన పంటలైన కొబ్బరి, కోకో, పోక వంటి దీర్ఘకాలిక పంటలతో పాటు కూరగాయ పంటలకు సైతం ఈ వర్షం మేలు చేసింది. తోటల్లో నీరు నిలబడే స్థాయిలో వర్షం కురిసిందని, ఇది వేసవి దుక్కులకు మంచిదని రైతులు చెబుతున్నారు.

ఫ జిల్లాలో పలుచోట్ల వర్షం

ఫ నిలిచిన వరి కోతలు

ఫ ఉద్యాన పంటలకు ఊరట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement