అల్లవరం: మహిళలను కించపరుస్తూ వారిని అవమానిస్తూ ఏబీఎన్‌లో వచ్చిన తప్పుడు కథనాలు, అసభ్యకర వ్యాఖ్యలను మాజీ ఎంపీ చింతా అనురాధ మంగళవారం తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో మీడియా సమాజానికి దారి దీపంలా ఉండాలికాని, మహిళల గౌరవాన్ని కించపరచే నీచ రాజకీయాలకు వేదికగా మారకూడదని పేర్కొన్నారు. కక్ష, పక్షపాత ధోరణితో ఈ కథనాల ద్వారా వేదన వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడుకి వత్తాసు పలుకుతూ ఏబీఎన్ రాధాకృష్ణ జర్నలిజం విలువలను పక్కనపెట్టారని, రాజకీయ ప్రత్యర్ధులపై వ్యక్తిత్వ హననానికి దిగజారడం దురదృష్టకరమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని అనురాధ డిమాండ్ చేశారు.
మహిళల ఆత్మగౌరవాన్ని
కించపరిస్తే సహించం
రాజోలు: మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు ప్రచారం చేస్తే సహించేది లేదని రాజోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్ పాముల రాజేశ్వరీదేవి అన్నారు. మంగళవారం ఆమె రాజోలులో మాట్లాడుతూ వార్తా ప్రచురణ, ప్రచారాల్లో కనీస నైతిక విలువలు పాటించకపోవడం బాధాకరమన్నారు. అసత్య వార్తలు ప్రచారం చేసినంత మాత్రాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఆత్మస్థైర్యం తగ్గదన్నారు. తప్పుడు కథనాలతో మహిళల మనోభావాలు దెబ్బతీసిన ఏబీఎన్ యాజమాన్యం రాష్ట్ర మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏబీఎన్ రాధాకృష్ణ సమాజానికి క్షమాపణ చెప్పాలి
ముమ్మిడివరం: పత్రికా విలువలను పక్కన పెట్టి మహిళలపై అసభ్యకరంగా మాట్లాడే స్థాయికి దిగజారిన ఏబీఎన్ రాధాకృష్ణ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధి, ఎస్‌ఈసీ మెంబర్ కాశి బాలమునికుమారి డిమాండ్ చేశారు. ఆమె మంగళవారం ముమ్మిడివరంలో విలేకరులతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంపై ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన దుర్మార్గపు వ్యాఖ్యాలను తీవ్రంగా ఖండించారు. జగన్‌మోహన్‌రెడ్డిని కోట్లాది మంది అనుసరిస్తారని, అటువంటి వారి గురించి మాట్లాడే అర్హత రాధాకృష్ణకు లేదని విమర్శించారు. చంద్రబాబు తానా అంటే తందానా అంటున్న ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన విమర్శలను తన కుటుంబ సభ్యులకు కూడా ఆపాదించుకుంటారా అని ఆమె ప్రశ్నించారు. తమ అధ్యక్షుడిని అగౌరవ పర్చేలా ఎల్లో మీడియా పేరుతో రాష్ట్రంలో విష ప్రచారం జరగుతోందని మండిపడ్డారు. రాధాకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మునికుమారి హెచ్చరించారు.


