మూడో పంట లేనట్టే! | - | Sakshi
Sakshi News home page

మూడో పంట లేనట్టే!

Apr 8 2026 8:20 AM | Updated on Apr 8 2026 8:20 AM

అపరాల సాగుకు ఆమడ దూరం

జిల్లాలో 2.30 లక్షల ఎకరాల ఆయకట్టు

వరి సాగు జరిగేది 1.77 లక్షల ఎకరాలు

ఏటా ఐదు శాతం కూడా ఉండని

అపరాల సాగు

ఈ ఏడాది అది కూడా కష్టమే

ఇప్పటికీ రాయితీపై నోరు మెదపని ప్రభుత్వం

గతంలో సుమారు 40 వేల ఎకరాల్లో సాగు

సాగు చేస్తే రైతుకు ఎకరాకు రూ.20 వేలకు పైగా అదనపు ఆదాయం

కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగుకు అనుకూలం

ఆదాయంతో పాటు చేను,

తోటలకు పచ్చిరొట్ట ఎరువు

సాక్షి, అమలాపురం: ఒకనాడు ఏడాదికి మూడు పంటలు పండే గోదావరి డెల్టా రాను రానూ వట్టిపోతోంది. గడిచిన రెండు దశాబ్దాలుగా మూడవ పంట అపరాల సాగు లేకుండా పోతుండగా దశాబ్ద కాలంగా తొలి పంట ఖరీఫ్‌కు రైతులు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది అసలు అపరాల సాగు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. సాగుకు సమయం లేకపోవడం, చంద్రబాబు ప్రభుత్వం నుంచి విత్తన రాయితీపై ఇప్పటి వరకు ఒక ప్రకటన లేకపోవడంతో ఈ ఏడాది అపరాల సాగు దాదాపు లేకుండా పోనుంది.

కోనసీమ జిల్లాలో సుమారు 2.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనిలో మండపేట నియోజకవర్గాన్ని కలుపుకుని 1.77 లక్షల ఎకరాలలో ఈ ఏడాది రబీ సాగు జరిగిన విషయం తెలిసిందే. జిల్లాలో ఆత్రేయపురం, మామిడికుదురు మండలాల్లో రబీ వరి కోతలు మొదలయ్యాయి. ఏప్రిల్‌ 15 నుంచి జోరందుకునే కోతలు మే రెండవ వారం వరకు జరిగే అవకాశముంది. ముందుగా సాగు చేసిన మండపేట, ఆలమూరు, కొత్తపేట వ్యవసాయ సబ్‌ డివిజన్‌లో నెలాఖరు నాటికి దాదాపుగా కోతలు పూర్తి అవుతాయి. ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, రామచంద్రపురం వ్యవసాయ సబ్‌ డివిజన్లలో మాత్రం మే 15 తరువాత కాని కోతలు పూర్తి కావు.

కలసిరాని కాలం

అపరాల సాగుకు కాలం కలిసి రావడం లేదు. గతంలో మార్చి 31 – ఏప్రిల్‌ 10 నాటికి రెండో పంట రబీ వరి కోతలు పూర్తి కావడంతో రైతులు మినుము, పెసలు వంటి పంటలు వేసేవారు. దీనివల్ల వీరు అదనపు ఆదాయం పొందేవారు. గోదావరి డెల్టాలో ఎకరాకు మూడు నుంచి ఆరు క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. ఇప్పుడు మినుము క్వింటాల్‌ ధర రూ.12,800 వరకు ఉండగా, పెసలు క్వింటాల్‌ రూ.13 వేల వరకు ఉంది. ఇదే కృష్ణా జిల్లాలో అయితే ఎకరాకు పది నుంచి పన్నెండు క్వింటాళ్ల వరకు దిగుబడి సాధిస్తున్నారు. అన్ని ఖర్చులు పోనూ రైతులకు ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ఆదాయం వచ్చే అవకాశముంది. దశాబ్దం క్రితం మొత్తం ఆయకట్టులో కనీసం సగం అపరాలు సాగు చేసేవారు. 2010 – 2015 మధ్య కాలంలో అయితే ఇప్పుడున్న కోనసీమ జిల్లాలో సుమారు 48 వేల ఎకరాల్లో సాగు జరిగేది. రానురానూ ఆయకట్టు కుదించుకుపోతోంది. గత ఏడాది కనీసం ఐదు వేల ఎకరాల్లో కూడా జరగలేదు. ఈ ఏడాది ఆ పరిస్థితి కూడా లేదు. ఇందుకు సమయం లేకపోవడం ఒక ప్రధాన కారణం. మే నెల వరకు కోతలు పూర్తయ్యే అవకాశం లేదు. ఈ ఏడాది ముందస్తు సాగుకు జూన్‌ 1వ తేదీ నాటికి నీరు విడుదల చేయాల్సి ఉంది. అపరాల పంట కాలం 75 నుంచి 85 రోజులు. దీనివల్ల సాగుకు సమయం సరిపోయే అవకాశం లేదని రైతులు చెబుతున్నారు.

సాగు చేస్తే ప్రయోజనాలెన్నో..

అపరాల సాగు చేస్తే రైతులకు అదనపు ఆదాయం సమకూరడంతో పాటు పలు ప్రయోజనాలు కలుగుతాయి. భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. పంటలకు మేలు చేసే సూక్ష్మ జీవులు వృద్ధి చెందుతాయి. రైజోబియం నోడర్స్‌ పెరగడం వల్ల తొలకరి పంటలో యూరియా వాడకం గణనీయంగా తగ్గించవచ్చు. చేనుకు పచ్చిరొట్ట ఎరువుతోపాటు పశువుల పెంటను కూడా వినియోగిస్తే భూమికి అమృతాన్ని అందించినట్టు అవుతుంది.

– అడ్డాల గోపాలకృష్ణ, కన్వీనర్‌,

రైతు మిత్ర రూరల్‌ టెక్నాలజీ పార్క్‌,

అమలాపురం

కొబ్బరిలో అంతర పంటగా..

రబీ వరి సాగు తరువాతనే కాకుండా కొబ్బరి తోటల్లో రైతులు అంతర పంటగా అపరాలు సాగు చేసేవారు. దీనివల్ల వారు అదనపు ఆదాయం పొందేవారు. కాని కొబ్బరి రైతులు ఇప్పుడు కోకో, పోక వంటి దీర్ఘకాలిక పంటలను, అరటి, కంద, పువ్వులు, కూరగాయల సాగుపై మక్కువతో అపరాల సాగుకు దూరంగా ఉంటున్నారు.

ప్రణాళిక ఇవ్వని ప్రభుత్వం

ఖరీఫ్‌ సాగు మోంథా తుపాను బారిన పడడం వల్ల ఆ ప్రభావం రబీపై పడింది. రైతులకు అప్పులు పుట్టక పోవడం కూడా రబీ ఆలస్యానికి కారణమైంది. దీనికితోడు చంద్రబాబు ప్రభుత్వం అపరాల సాగుపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. విత్తనాల రాయితీ ప్రకటన చేయలేదు. అపరాలు అటుంచి కనీసం పచ్చి రొట్ట ఎరువులకు సంబంధించి కూడా ప్రణాళిక విడుదల కాకపోవడం విశేషం. ఇటీవల కాలంలో అపరాల సాగుకు పల్లాకు తెగులు ప్రధాన అవరోధంగా మారింది. అయితే దానిని కూడా రైతులు మందులతో అధిగమిస్తున్నారు. కాని సమయం లేనందు వల్ల గత్యంతరం లేక రైతులు సాగుకు దూరంగా ఉంటున్నారు. అయితే ముందుగా కోతలు పూర్తయ్యే మండపేట, ఆలమూరు, కొత్తపేట సబ్‌ డివిజన్‌లో రైతులు అపరాల సాగు చేయవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతుండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement