లోవకు పోటెత్తిన భక్తులు
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానం ఆదివారం కిక్కిరిసిపోయింది. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలి వచ్చిన 15 వేల మంది భక్తులు క్యూలో అమ్మవారిని దర్శించుకున్నట్టు కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. లడ్డూ, పులిహోర ప్రసాద విక్రయాల ద్వారా రూ.2,00,455, పూజా టికెట్లకు రూ.2,25,280, కేశఖండన శాలకు రూ.12,400, వాహన పూజలకు రూ.7,890, పొంగలి షెడ్లు, కాటేజీలు, వసతి గదుల అద్దెలు రూ.61,070, విరాళాలు రూ.49,366 కలిపి మొత్తం రూ.5,56,451 ఆదాయం సమకూరిందని వివరించారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పారు.


