సాక్షి, అమలాపురం: ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా ఉంటూ సమస్యలపై స్పందించే ప్రజాప్రతినిధులకూ గౌరవ వేతనం అందకుంది.. సమాజంలో కీలకమైన ప్రజాప్రతినిధుల గౌరవ వేతనానికీ చంద్రబాబు సర్కారు ఎగనామం పెడుతోంది.. ‘కూటమి’ అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక సంస్థలపై చిన్నచూపు ప్రదర్శిస్తోంది. జిల్లా, మండల పరిషత్‌లు, పంచాయతీలు.. ఇలా మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థలో తొంభై శాతానికి పైగా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఏలుబడిలో ఉండడంతో అధికార పార్టీకి కంటిగింపుగా మారింది. ఇప్పటికే మున్సిపాలిటీ, పంచాయతీలు, మండల పరిషత్‌లలో అధికార పార్టీకి చెందిన టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల మితిమీరిన జోక్యం పెరిగింది. ఇది చాలదన్నట్టు కనీస గౌరవం ఇవ్వడం లేదు సరికదా.. వారికి ‘గౌరవ’ వేతనాలకూ నెలల పాటు బకాయిలు పెడుతోంది.
జిల్లా పరిషత్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఉంది. చైర్మన్‌తోపాటు జెడ్పీటీసీ సభ్యులకు మూడేళ్లుగా గౌరవ వేతనం ఇవ్వడం లేదు. జెడ్పీ చైర్మన్‌కు నెలకు రూ.40 వేల చొప్పున, జెడ్పీటీసీలకు రూ.ఆరు వేల చొప్పున వేతనాలు ఇవ్వాలి. ఉమ్మడి జిల్లాలో 61 మంది వరకూ జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. వీరికి సుమారు రెండున్నరేళ్ల వరకూ రూ.1.09 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంది. జిల్లాలో 23 మండల పరిషత్ అధ్యక్షులు, 397 మంది వరకూ ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. ఎంపీపీలకు నెలకు రూ.ఆరు వేల చొప్పున ఇవ్వాలి.
అయితే కొంతమంది మంది ఎంపీపీలకు రెండున్నరేళ్ల నుంచి వేతనాలు రాకపోగా, మరికొంత మంది ఎంపీపీలకు కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ ఇవ్వాల్సి ఉంది. ఎంపీపీలకు గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ కేవలం మూడు నెలలు వేతనాలు విడుదల చేసి మమ అనిపించారు. జిల్లా వ్యాప్తంగా ఎంపీపీలు, ఎంపీటీసీలకు రూ. ఐదు కోట్ల వరకూ వేతనాలు చెల్లించాలి. జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులతో పోల్చుకుంటే పంచాయతీల సర్పంచులకు కొంత వరకూ వెసులుబాటు ఉంది. కనీసం పంచాయతీలకు వచ్చే జనరల్ ఫండ్ నుంచి వేతనాలు తీసుకునే అవకాశముంది. అయితే ఉన్న కొద్దిపాటి నిధుల్లో వేతనాలు తీసుకోవడం ఇబ్బందికరంగా మారడంతో వారు వెనుకంజ వేస్తున్నారు.
నిధుల్లేవ్.. పనుల్లేవ్
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత స్థానిక సంస్థలకు ఇచ్చే నిధుల విషయంలో తీవ్ర వివక్ష చూపుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు పాత ఇసుక సీనరేజ్ బిల్లులు ఇంకా ఇవ్వలేదు. సుమారు రూ.వంద కోట్ల వరకూ ఇవ్వాల్సి ఉంది. ఇక స్టాంప్ డ్యూటీ వాటా రూ.50 కోట్లకు పైగా రావాలి. దీనితో జెడ్పీ పరిధిలో జరగాల్సిన అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కె.గంగవరం మండల పరిషత్‌కు గతంలో రూ.కోటి వరకూ సీనరేజ్ రూపంలో అందేది. ఇప్పుడు ఈ సొమ్ములు రావడం లేదు. ప్రభుత్వం వచ్చి కేవలం 15వ ఆర్థిక సంఘం నిధులు మాత్రమే ఇచ్చింది. అది కూడా ఎంపిక చేసిన పంచాయతీలు, మండల పరిషత్‌లకు మాత్రమే కావడం గమనార్హం.
పిలుపు కూడా కరవాయే..
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత పలుచోట్ల ప్రోటోకాల్ వివాదాలు రేగుతున్నాయి. జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవడం లేదు. ఎంపీడీఓలు జెడ్పీ పరిధిలో పనిచేస్తున్నారు. జెడ్పీతోపాటు మండల పరిషత్‌లు 90 శాతం వైఎస్సార్ సీపీ ఏలుబడిలో ఉన్నా ఎంపీడీఓలు వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదు. జెడ్పీ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు దీనిపై ఎంపీడీఓలకు ఎన్నిసార్లు క్లాస్ తీసుకున్నా ఫలితం లేదు.
స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వారు పనిచేస్తుండడం గమనార్హం. దీనిపై గత మే నెలలో జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు, కోనసీమకు చెందిన వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్‌కు వినతిపత్రం అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఒకవైపు అభివృద్ధి పనులకు నిధులు లేకుండా పోవడం.. మరోవైపు గౌరవ వేతనం.. ప్రోటోకాల్ పరంగా గౌరవం లేకపోవడంపై స్థానిక సంస్థల ప్రతినిధులు గుర్రుగా ఉన్నారు.
ఇక ఏం ప్రయోజనం
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రజలతో ఎన్నుకోబడిన వారే. ఈ ప్రభుత్వంలో వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదు. అధికారులూ పట్టించుకోవడం లేదు. నిధులు, విధులు కల్పించనప్పుడు ఈ వ్యవస్థ ఉండి ఏం ప్రయోజనం. ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వడంతోపాటు తక్షణం గౌరవ వేతనం విడుదల చేయాలి. –పందిరి శ్రీహరి రామగోపాల్, జెడ్పీటీసీ సభ్యుడు, అమలాపురం


