ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్ అర్హత పరీక్ష
రాయవరం: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్‌కు అర్హత పొందేందుకు ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా రామచంద్రపురం, కొత్తపేట, అమలాపురం రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. మొత్తం 14 పరీక్ష కేంద్రాల్లో 3,106 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 3,038 మంది హాజరయ్యారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించారు. ముందు ఆయా కేంద్రాల వద్ద విద్యార్థులకు సీఎస్, డీఓలు పరీక్ష రాసే విధానంపై అవగాహన కల్పించారు. ఈ కేంద్రాలను జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ బి.హనుమంతరావు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు. 150 మంది సీఎస్, డీవోలు, ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్లు డీఈఓ తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు.
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
అమలాపురం రూరల్: అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ గోదావరి భవన్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను సోమవారం ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ సమస్యలను ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకూ జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలు పొందాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా స్థాయితో పాటు మూడు రెవెన్యూ డివిజనల్ అధికారుల, మండల తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో గ్రీవెన్స్ ఉంటుందన్నారు.
18న ఏపీ ఎన్జీఓ జిల్లా
అసోసియేషన్ ఎన్నికలు
కొత్తపేట: ఏపీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (ఎన్జీఓ) జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 18న నిర్వహించేందుకు రాష్ట్ర నాయకత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ విషయాన్ని కొత్తపేట తాలూకా ఎన్జీఓ నాయకులు ఆదివారం తెలిపారు. ఈ ప్రక్రియకు ఎన్నికల అధికారిగా ఎన్టీఆర్ జిల్లా ఎన్జీఓ అధ్యక్షుడు డి.సత్యనారాయణరెడ్డి, సహాయ ఎన్నికల అధికారిగా ఆ జిల్లా కార్యదర్శి పి.రమేష్, పరిశీలకురాలిగా రాష్ట్ర ప్రచార కార్యదర్శి డి.జానకిని నియమించారు. ప్రెసిడెంట్, అసోసియేట్ ప్రెసిడెంట్, ఐదుగురు వైస్ ప్రెసిడెంట్లు, ఒక ఉమెన్ వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఐదుగురు జాయింట్ సెక్రటరీలు, ఉమెన్ జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్‌తో మొత్తం 17 పోస్టులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితా ప్రచురణ, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తయ్యింది. కాగా, ఈ నెల 11న నామినేషన్లు వేయడం, పరిశీలన, ఆమోదం, ఉపసంహరణ, నామినేషన్ల తుది జాబితా విడుదల ఉంటుంది. 18న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్, రెండు గంటల నుంచి కౌంటింగ్, అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. అమలాపురం పంచాయతీరాజ్ కాటన్ గెస్ట్ హౌస్‌లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్జీఓ నాయకులు తెలిపారు.
అకడమిక్ ఇనస్ట్రక్టర్ల పోస్టులకు 370 దరఖాస్తులు
రాయవరం: పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా పాఠశాల విద్యాశాఖ అకడమిక్ ఇనస్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. జిల్లాలో 53 అకడమిక్ ఇనస్ట్రక్టర్ పోస్టులకు 370 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 16 ఎస్జీటీ పోస్టులకు 219 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు సుమారు 14 మంది పోటీ పడుతున్నారు. అలాగే ఎస్జీటీ ఉర్దూ పోస్టులకు 7 దరఖాస్తులు, 2 స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ పోస్టులకు 2 దరఖాస్తులు వచ్చాయి. స్కూల్ అసిస్టెంట్ విభాగం నుంచి ఒక తెలుగు పోస్టుకు 12, 16 హిందీ పోస్టులకు 62, ఒక ఇంగ్లిష్ పోస్టుకు 8, మూడు ఫిజికల్ సైన్స్ పోస్టులకు 15, ఆరు బయలాజికల్ సైన్స్ పోస్టులకు 33, ఒక సోషల్ స్టడీస్ పోస్టుకు 12 దరఖాస్తులు వచ్చాయి.


