యాప్‌లతో ఉపాధ్యాయులు బోధనకు దూరం
ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిశ్రీనివాస్
అయినవిల్లి: బోధనేతర పనులు, యాప్‌లతో ఉపాధ్యాయులను ప్రభుత్వం బోధనకు దూరం చేస్తోందని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లంకలపల్లి సాయి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ముక్తేశ్వరంలోని వైవీఎస్ అండ్ బీఆర్‌ఎం కళాశాల ప్రాంగణంలో ఎస్టీయూ జిల్లా కౌన్సిల్ సమావేశం పోతంశెట్టి దొరబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చి, ఇప్పుడు అమలుకు తాత్కారం చేస్తోందన్నారు. ఉపాధ్యాయులకు బదిలీలు లేకుండా చేశారని, కొన్నిచోట్ల బదిలీలు చేసి రిలీవ్ చేయలేదని అన్నారు. డీఏ బకాయిలు చెల్లించలేదని, పదోన్నతులు ప్రకటించలేదన్నారు. పీఆర్సీ కమిటీ తక్షణమే నియమించాలని, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) నుంచి సర్వీసులో ఉన్న ఉపాధాయులకు సడలింపు ఇవ్వాలని కోరారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు నాగిరెడ్డి శివప్రసాద్, రాష్ట్ర కన్వీనర్ నల్లి ప్రసాద్, బోనం వెంకట గంగాధర్, కేవీఎస్ ఆచారి, మట్టా నాగరాజు, ఉమ్మడి జిల్లా ఎస్టీయూ మాజీ అధ్యక్షుడు కేవీ శేఖర్, ఉద్యమ నాయకులు కేకేవీ నాయుడు, ఎస్‌వీ నాయుడు, నేరేడిమిల్లి సత్యనారాయణ, పసుపులేటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.


