సాక్షి, రాజమహేంద్రవరం: రబీ సాగుకు నీటి కొరత తప్పదా.. గోదావరిలో నీటి లభ్యత తగ్గుముఖం పట్ట డం ఆందోళన కలిగిస్తోందా.. అంటే అవుననే సమా ధానం వస్తోంది సాగునీటి నిపుణుల నుంచి. ప్రస్తుతం ఖరీఫ్ వరి కోతలు, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశలో ఉంది. రబీ సాగు దిశగా అడుగులు పడుతున్నాయి. నారుమళ్లు సిద్ధం చేసుకునే పనిలో రైతులు తలమునకలవుతున్నారు. ఈ తరుణంలో సాగునీరు సక్రమంగా అందుతుందా లేదా అనే మీమాంస గోదావరి డెల్టా రైతుల్లో నెలకొంది. ఖరీఫ్ సాగులో తీవ్రంగా నష్టపోయామని, రబీ అయినా సవ్యంగా సాగుతుందో లేదోనని సందేహపడుతున్నారు.
పొదుపుపై ఫోకస్
ఎద్దడి నుంచి రబీ సాగు గట్టెక్కేందుకు ప్రతి ఒక్కరూ నీటి పొదుపు పాటించాలని అధికారులు కోరుతున్నారు. పలు ప్రాంతాల్లో మురుగు కాలువలకు అడ్డుకట్టలు వేయాలని, ఆయిల్ ఇంజిన్ల ద్వారా శివారు ప్రాంతాలకు సాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. కోనసీమ జిల్లాలోని సెంట్రల్ డెల్టాలో సాగునీటి కష్టాల నివారణకు రూ.2.5 కోట్లతో ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. అలాగే, పశ్చిమ డెల్టా పరిధిలోని ఏలూరు జిల్లా నుంచి రూ.56,199, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రూ.2 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. క్షేత్ర స్థాయిలో నీటి పొదుపు చర్యల పర్యవేక్షణకు గోదావరి మూడు డెల్టాల్లో 610 మంది తాత్కాలిక లస్కర్లను నియమించారు.
రబీకి పోల‘వరం’
పోలవరం ప్రాజెక్టుపై గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకున్న చొరవ గోదావరి డెల్టా రైతులకు వరంగా మారింది. పోలవరం ప్రాజెక్టు గేట్లను గత ప్రభుత్వ హయాంలోనే బిగించారు. ఫలితంగా పోలవరం నుంచి 20 టీఎంసీల నీరు రబీ సాగుకు అందుబాటులోకి వస్తోంది. అంతే కాకుండా గత ప్రభుత్వ హయాంలో నీటి నిర్వహణ, పొదుపు చర్యలు పకడ్బందీగా జరగడంతో సాగునీటి కొరత తలెత్తిన దాఖలాలే లేవు. రైతులు సైతం ఆనందంగా సాగుకు సమాయత్తమయ్యేవారు.
చివరి ఎకరా వరకూ నీరివ్వాలి
సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పక్కాగా అమలు చేయాలి. రైతుకు సహాయం చేయడంలో ఎలాంటి వెనుకడుగూ వేయకూడదు. రబీ సాగునీటి చర్యలు ముందస్తుగా చేపట్టాలి. ఆయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేయాలి. డ్రెయిన్లపై అడ్డుకట్టలు వేసే పనులు వేగవంతం చేయాలి. లస్కర్లు 24 గంటలూ కాలువల మీద ఉండేలా చూసుకోవాలి. ఎగువన పోలవరం ప్రాజెక్టుకు గేట్లు బిగించే కార్యక్రమం గత ప్రభుత్వంలో పూర్తవడంతో ప్రస్తుతం పోలవరం నుంచి నీరు వాడుకునే వెసులుబాటు కలుగుతోంది. నీటి కొరతకు ఆస్కారం లేకుండా సీలేరు ద్వారా అవసరమైన నీటిని సేకరించి, చివరి ఆయకట్టు వరకూ చేరేలా చర్యలు తీసుకోవాలి.
– విప్పర్తి వేణుగోపాలరావు, జిల్లా పరిషత్ చైర్మన్, రిటైర్డ్ ఎస్‌ఈ, ఇరిగేషన్ సర్కిల్, ధవళేశ్వరం
లక్షల ఎకరాల ఆయకట్టు
సీలేరు పైనే ఆశలు
ఏటా గోదావరి డెల్టాలో రబీకి సీలేరు జలాలే కల్పతరువుగా మారుతున్నాయి. ఈసారి సైతం అదే పరిస్థితి తలెత్తుతోంది. సీలేరు జలాశయంలో సుమారు 70 టీఎంసీల నీరు అందుబాటులో ఉండవచ్చని అంచనా వేశారు. దీని నుంచి ప్రతి రోజూ 4,200 క్యూసెక్కుల సాగునీరు అందుతుందని జల వనరుల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రబీ సాగు దృష్ట్యా ఇప్పటికే 43.91 టీఎంసీల నీటిని గోదావరి డెల్టాకు విడుదల చేసేందుకు సీలేరు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
ఇవి కాకుండా నీటి కొరతను ఎదుర్కొనేందుకు మరో 19.90 టీఎంసీలు సీలేరు ద్వారా తీసుకు వచ్చేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే, ఇక్కడే అసలు సమస్య తలెత్తుతోంది. సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని పొల్లూరు జల విద్యుత్ కేంద్రానికి నీటిని అందించే డొంకరాయి పవర్ కెనాల్‌కు రెండు నెలల పాటు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏపీ జెన్‌కో చీఫ్ ఇంజినీర్ ప్రకటించారు. దీంతో, రానున్న రెండు నెలలూ సీలేరు నుంచి అనుకున్న స్థాయిలో నీరు వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో కొరత ఉన్న 19.90 టీఎంసీల జలాలు ఎలా అందుబాటులోకి వస్తాయనే మీమాంస నెలకొంది.
నీటి లభ్యతపై ఆందోళన
గోదావరి డెల్టా పరిధిలోని ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 8,96,507 లక్షల ఎకరాలకు రబీ సాగునీరు అందించాలని అధికారులు నిర్ధారించారు. మొత్తం 93.26 టీఎంసీల నీరు అవసరమని లెక్క తేల్చగా.. ఇందులో సాగునీరు 86.04 టీఎంసీలు, పరిశ్రమలు, తాగునీటి అవసరాలకు 7.22 టీఎంసీలు అవసరమని చెబుతున్నారు. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా డిసెంబర్ నెలలోనే గోదావరిలో నీరు తగ్గుముఖం పట్టింది.
అక్కడక్కడ ముఖ్యంగా ధవళేశ్వరం ఆనకట్ట ఎగువన ఇప్పటి నుంచే భారీ ఇసుక మేటలు దర్శనమిస్తున్నాయి. ఆనకట్టకు కేవలం 500 మీటర్ల దూరంలోనే నదిలో పలుచోట్ల రెండు మూడడుగుల లోతున మాత్రమే నీరుంటోంది. రోడ్డు కం రైల్వే వంతెన వద్ద నీరు పూర్తిగా తగ్గిపోయింది. దీంతో, రబీ సాగుకు చాలినంత నీటి లభ్యత ఉండదేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది.


