ముప్పు మంచుకొచ్చేలా..
● ఉదయం 9 గంటలకూ వీడని మంచు
● మధ్యాహ్నం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
● విభిన్న వాతావరణంతో రోగాలు
● వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం
ఐ.పోలవరం/ అంబాజీపేట: పచ్చని కోనసీమ మన్యాన్ని తలపిస్తోంది. మూడు రోజులుగా దట్టమైన మంచు కమ్ముకుంటోంది. ఉదయం 9 గంటలైనా వీడడం లేదు. మధ్యాహ్నం నుంచి మాత్రం ఎండ చుర్రుమనిపిస్తోంది. ఇలా విభిన్నమైన వాతావ‘రణం’ జనానికి రోగాలు తెచ్చిపెడుతుండగా.. వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా పంటలను దెబ్బతీస్తోంది. జిల్లాను మంచు దుప్పటి కప్పేస్తోంది. ఉదయమైనా రహదారులరె మంచు కప్పేయడంతో వాహనచోదకులు ఇబ్బందులు పాలవుతున్నారు. లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి వస్తోంది. జాతీయ రహదారి 216పై మంచు కారణంగా లారీలు, బస్సులు, కార్లు నడిపేవారు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం వేళలో ప్రయాణించే విద్యార్థులు, రైతులు, కూలీలు సైతం ఇబ్బందులు పడుతున్నారు.
ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం
రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం.. పగటి పూట ఎక్కువగా ఉండడం జరుగుతోంది. జిల్లాలో కనిష్టంగా 20 డిగ్రీలు, మధ్యాహ్న సమయంలో గరిష్టంగా 31 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం అన్ని రకాల అనర్థాలకు దారితీస్తోంది. ముఖ్యంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. తీవ్రమైన దగ్గు వెంటాడుతోంది. దగ్గు వస్తే ఎన్ని మందులు వాడినా తగ్గేందుకు నెల రోజుల సమయం పడుతోందని పలువురు చెబుతున్నారు. మంచు వల్ల జలుబు, జ్వరాల తీవ్రత కూడా పెరిగింది.
పంటలకూ ముప్పు
● ఉదయం దట్టంగా కమ్ముకున్న మంచు వ్యవసాయ పంటలకు ముప్పుగా మారింది. జిల్లాలో రబీ వరి నాట్లు ఇంకా పడుతున్నాయి. నాట్లు వేసిన పొలాల్లో రైతులు, కూలీలు ఎరువులు చల్లుతున్నారు. మంచు వల్ల ఉదయం పనులు వేగంగా సాగడం లేదు. అలాగే వరిలో అగ్గి తెగులు సోకే ప్రమాదం పెరిగింది.
● కొబ్బరి, కోకో, అరటి వంటి పంటలపై తెల్లదోమ (రూగోస్ వైట్ ఫ్‌లై) తీవ్రత పెరుగుతుండడంతో రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉదయం చలి, మధ్యాహ్న ఎండ, ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం పడి డిగ్రీల వరకూ తేడా ఉండడంతో దీని విజృంభన పెరిగింది. తెల్లదోమ ఉధృతికి ఇది అనుకూల వాతావరణం.
● ఆక్వా సాగుకూ మారిన వాతావరణం పెను ముప్పుగా మారింది. ఉష్ణోగ్రతల వ్యత్యాసం వల్ల రొయ్యలకు తెల్లమచ్చల వ్యాధి సోకుతుందని రైతులు భయపడుతున్నారు. ప్రస్తుతం సాగు తక్కువగా ఉంది. ఆయాచోట్ల రొయ్యలు తెగుళ్ల బారిన పడతాయని చెబుతున్నారు.
అంబాజీపేటలో ఉదయం 9 గంటలకు వీడని మంచు
ఎదుర్లంక వద్ద మంచులోనే వరి చేలో ఎరువులు చల్లుతున్న కూలీలు
చలి గాలులతో అనర్థాలు
ప్రస్తుత వాతావరణంలో మంచుతో కూడిన చలి గాలులతో పలు రుగ్మతలు వచ్చే అవకాశముంది. ఫ్లూ ఇన్ఫెక్షన్, జలుబు, దగ్గు, ఆస్తమా శ్వాసకోస వ్యాధులు, జ్వరం, తలనొప్పి, ఆయాసం, కంటి సంబంధిత ఎలర్జీలు రావొచ్చు. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్, స్వెట్టర్ ధరించాలి. చల్లార్చిన లేదా గోరువెచ్చని నీరు తాగాలి. పెద్ద వయసు ఉన్నవారు ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి.
– డాక్టర్ ఎంఎస్ రాజేష్‌బాబు,
పీహెచ్‌సీ వైద్యాధికారి, కేశనకుర్రు
ముప్పు మంచుకొచ్చేలా..
ముప్పు మంచుకొచ్చేలా..


