తిరుమల లడ్డూపై కూటమివి కూతలే
● అమలాపురం వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ శ్రీకాంత్, ఎమ్మెల్సీలు ఇజ్రాయిల్, సూర్యనారాయణరావు
● చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్‌లు క్షమాపణ చెప్పాలని డిమాండ్
అమలాపురం టౌన్: తిరుమల లడ్డూలో వినియోగించిన నెయ్యి జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వ ముఖ్య నేతల వక్రబుద్ధి మారాలని కోరుతూ అమలాపురం నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం కొబ్బరికాయలు కొట్టారు. అమలాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడారు. దేశంలోని 140 కోట్ల భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా తిరుమల దేవస్థానం, లడ్డూపై విష ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్‌లు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ ముఖ్య నేతలే కాకుండా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు లడ్డూపై కారు కూతలు కూశారని ధ్వజమెత్తారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అపవాదులు వేశారని నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీకాంత్ ధ్వజమెత్తారు. వెంటనే వారు వైఎస్ జగన్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారి అనుకూల మీడియాను అడ్డుపెట్టుకుని తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం చేశారని ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ స్పష్టం చేశారు. సీబీఐ సిట్ విచారణలో నిజం నిగ్గుతేలిన తర్వాత చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల కుట్ర బుద్ధి తెలిసిందన్నారు. సిట్ నిజాలు తేల్చిన తర్వాత కూడా సిగ్గు లేకుండా బొంకుతున్న కూటమి నేతల వైఖరిని దుయ్యబట్టారు. తొలుత ఎమ్మెల్సీలు, పార్టీ కో ఆర్డినేటర్, నాయకులు, కార్యకర్తలు స్థానిక వేంకటేశ్వర దేవస్థానం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. దేవస్థానం ధ్వజస్తంభం వద్ద 200 కొబ్బరి కాయలు కొట్టారు. అనంతనం దేవస్థానంలోకి వెళ్లి వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఇప్పటికై నా కూటమి నేతల బుద్ధి మారాలని అన్నారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి), మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, వైస్ చైర్మన్ రుద్రరాజు నానిరాజు, ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, జెడ్పీటీసీ సభ్యుడు పందిరి శ్రీహరి రామ్‌గోపాల్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్నాయుడు, పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు కుడుపూడి భరత్ భూషణ్, పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, అమలాపురం పట్టణ, ఉప్పలగుప్తం మండల పార్టీ అధ్యక్షులు సంసాని బులినాని, బద్రి బాబ్జి, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ అనుబంధ కమిటీల నాయకులు ఉండ్రు వెంకటేష్, గొవ్వాల రాజేష్, సరెళ్ల రామకృష్ణ, ఉండ్రు బాబ్జి, కముజు రమణ, గుత్తుల రాజు, దూడల ఫణి, తిక్కా ప్రసాద్, యల్లమిల్లి సుభాష్ చంద్రబోస్, కల్వకొలను ఉమ, ఈతకోట శ్రావణ్, మున్సిపల్ కౌన్సిలర్లు చిట్టూరి పెదబాబు, బండారు గోవిందు పాల్గొని కొబ్బరి కాయలు కొట్టారు.


