నమో నారసింహాయ..
ఫ అంతర్వేదిలో కొనసాగిన కల్యాణోత్సవాలు
ఫ స్వామివారికి అన్నపర్వత మహానివేదన
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనారసింహుని కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శుక్రవారం ద్వాదశి రోజున స్వామివారికి అన్నపర్వత మహా నివేదనను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పొలమూరు వారి సత్రం నిర్వాహకులు ఇచ్చిన బియ్యంతో అన్నం వండి, రాత్రి 7 గంటలకు స్వామివారి మూలవిరాట్ ఎదురుగా ఉన్న మండపంలో అర్చకులు అన్నం పర్వతంగా పోశారు. పప్పు, పులుసు, రెండు రకాల కూరలు, పెరుగు, నెయ్యి, బూరెలతో స్వామివారికి ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేదపండితుడు చింతా వెంకటశాస్త్రి, అర్చక స్వాములు మహా నివేదన సమర్పించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. అన్నపర్వతంలోని కొంత భాగాన్ని భక్తులందరికీ ప్రసాదంగా పంచారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్, ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమార రామ గోపాలరాజా బహుద్దూర్, ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ దెందుకూరి రాంబాబురాజు, సేవా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
గజ, పొన్న వాహనాలపై గ్రామోత్సవం
సాయంత్రం 4 గంటలకు గజ వాహనంపై, రాత్రి 8 గంటలకు పొన్న వాహనంపై శ్రీస్వామివారికి గ్రామోత్సవాలు నిర్వహించారు. గ్రామ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. తొలుత ఆలయం వద్ద నుంచి పల్లకిలో స్వామి, అమ్మవార్లను అలంకార మండపానికి తోడ్కొని వచ్చారు. మండపంలో స్వామివారిని పూలతో అలంకరించి విశేష పూజలు చేశారు. వాహనాల వద్ద ప్రముఖులు, అర్చకులు కొబ్బరి కాయలు కొట్టిన అనంతరం గ్రామోత్సవాన్ని నిర్వహించారు. కాగా శ్రీస్వామివారి సన్నిధిని శుద్ధిచేసి అన్నపర్వత నివేదన నిమిత్తం సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ భక్తులకు దర్శనాన్ని నిలిపివేశారు. అనంతరం యథావిధిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ఉత్సవాల్లో నేడు..
స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం ఏడో రోజు వేకువజామున 4 గంటల నుంచి 5.30 గంటల వరకూ సుప్రభాతసేవ, తిరువారాధన, స్వామివారి అలంకరణ, బాలభోగం, అనంతరం సాధారణ, ప్రత్యేక దర్శనాలు ఉంటాయి. సాయంత్రం 4 గంటలకు రాజాధిరాజా వాహనంపై, రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై శ్రీస్వామివారి గ్రామోత్సవాలను నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు సదస్యం, రాత్రి 8 గంటలకు 16 స్తంభాల మండపం వద్ద చోర సంవాదం ఘట్టం జరుపుతారు.
నమో నారసింహాయ..


