ఘనంగా సదస్యం, నగరోత్సవం
రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామలోని మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం స్వామివారి సదస్యం ఘనంగా నిర్వహించారు. కల్యాణ మూర్తులైన మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి, లక్ష్మీ సమేత నారాయణస్వామి, చండికా సమేత సూరేశ్వరస్వామివార్లను వేదికపై అధిష్టింపజేసి, ఆలయ అర్చకులు సుగంధ ద్రవ్యాలను పూశారు. అనంతరం గణపతి పూజ, ముక్కోటి దేవతా ఆవాహన చేశారు. వేద స్వస్తి, స్వస్తి ప్రవచనం అనంతరం పండితులు, అర్చకులు, స్వస్తివాచకులు, పురోహితులకు ఆలయ సూపరింటెండెంట్ సూరపురెడ్డి వెంకటేశ్వరరావు (వెంకన్నబాబు) నూతన వస్త్రాలు అందజేసి సత్కరించారు. నీరాజన మంత్రపుష్పంతో సదస్యం పూర్తయ్యింది. స్వామివారి సదస్యం వీక్షించిన భక్తులకు వడపప్పు, పానకం పంపిణీ చేశారు. అనంతరం సర్వ వాహనాలపై కల్యాణమూర్తులకు నగరోత్సవం నిర్వహించారు.


