అవినీతి ఫెస్టివల్
● సంక్రాంతి సంబరాల పేరుతో
‘కూటమి’ దోపిడీ
● ఎస్.యానాంలో సాగిన అక్రమాలు
● వెలుగులోకి తెచ్చిన
ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్
● ఎంత ఖర్చు చేశారో చెప్పాలని
ఎమ్మెల్యేకు సవాల్
● తాజాగా మాజీ సీఎం జగన్‌కు
ఇజ్రాయిల్ ఫిర్యాదు
సాక్షి, అమలాపురం: సంక్రాంతి సంబరాల ముసుగు లో అధికార పార్టీ నేతల అవినీతిపై రేగిన అలజడి ఆగలేదు.. ఎస్.యానాం బీచ్ ఫెస్టివల్‌లో అక్రమాలు జరిగాయని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ పేల్చిన బాంబు అధికార పార్టీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.. ఎమ్మెల్సీ ఆధారాలతో కూడిన ఆరోపణలు చేస్తే వాటికి సమాధానం చెప్పాల్సింది పోయి టీడీపీ, జనసేన నాయకులు ఎదురుదాడికి దిగడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ విషయంలో ఇజ్రాయిల్ మాత్రం వెనకడుగు వేయడంలేదు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తాజాగా ఫిర్యాదు చేశారు.
పండగ ముందు సంక్రాంతి సంబరాల పేరుతో జిల్లాలో అధికార పార్టీ నేతలు సాగించిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. కీలక నేతలతో పాటు స్థానిక కార్యకర్తల వరకూ దోపిడీ నిర్విఘ్నంగా కొనసాగించారు. పేరుకు ప్రభుత్వం సంక్రాంతి సంబరాలు అంటూ ప్రచారం చేసినా వీటి ముసుగులో కోడి పందేలు, గుండాటలు, లోనా బయటా వంటి జూదాలు నిర్వహించారు. పండగ ముందే వీటిని ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చినా పోలీసులు, అధికారులు మౌనంగా ఉండిపోయారు. ఇదే అదునుగా అధికార పార్టీ నాయకులు చెలరేగిపోయారు. ముఖ్యంగా ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో ‘ఆంధ్రా గోవా కోకో బీచ్’ సంక్రాంతి సంబరాల పేరుతో జరిగిన నిర్మాణాలపై విమర్శలు వెల్లువెత్తాయి.
నిర్మాణాల వారీగా అవినీతిపై..
బీచ్ ఫెస్టివల్ పేరుతో అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ మీడియా సమావేశంలో నేరుగా ఆరోపించారు. అక్కడ జరిగిన అవినీతి ఇదే నంటూ నిర్మాణాల వారీగా ఆయన మీడియా ముందు బయట పెట్టారు. నియోజకవర్గంలో పలు సమస్యలు ఉండగా, చమురు సంస్థలు ఇచ్చే కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ ఫండ్ (సీఎస్‌ఆర్) నిధులతో బీచ్ ఫెస్టివల్‌కు సంబంధించి నిర్మాణాలు చేపట్టడంపై ఘాటైన విమర్శలకు దిగారు. ఈ విషయంలో ఆనందరావుకు అన్నివిధాలా సహకరించారని ఆయా శాఖల అధికారులు, వారి కుటుంబ సభ్యుల పేర్లతో సహా వివరించారు. ఒక కీలక ఉద్యోగి కుటుంబ సభ్యుడే కాంట్రాక్టర్ అవతారం ఎత్తడం, అమలాపురం రూరల్ మండలం జనసేనకు చెందిన కీలక నాయకుడు సీఆర్‌జెడ్ పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు చేయడం, అదే మట్టితో బీచ్ లెవెలింగ్, బీచ్‌కు వెళ్లేందుకు వేసిన రోడ్లకు వినియోగించడం వంటి వా టిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మట్టి కోసం స్థానికంగా ఉన్న మడ అడవులను ధ్వంసం చేయడం, తీరంలో సముద్ర ఇసుక పెద్ద ఎత్తున తవ్వడం వంటి విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఈ ఖర్చులపై ఆనందరావు వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు.
నోరుమెదపక.. డిమాండ్‌కు అంగీకరించక
ఇప్పటి వరకూ అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు నోరుమెదపలేదు. శ్వేతపత్రం డిమాండ్‌కు అంగీకరించలేదు. ప్రధానంగా సీఎస్‌ఆర్, వీబీ–జీ రామ్‌జీ (ఎంజీఎన్‌ఆర్‌జీఎస్) నిధులు రూ.కోట్లు ఖర్చు చేయడం, వీటికి సంబంధించి ఎంత నిధులు కేటాయించారు? ఎంత ఖర్చు పెట్టారు? వంటి వాటిపై అధికారులు సైతం కిమ్మనకుండా ఉండిపోయారు. కానీ టీడీపీ, జనసేనలకు చెందిన నియోజకవర్గ చోటామోటా నాయకులు మాత్రం ఇజ్రాయిల్‌పై ఎదురుదాడికి దిగారు. ఆయన మాత్రం వెనకడుగు వేయలేదు. ఈ విషయాన్ని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎస్.యానాం బీచ్‌లో జరిగిన అవినీతి అక్రమాలను వివరించారు. దీనిపై తాను చేస్తున్న పోరాటానికి పార్టీ మద్దతు ఉంటోందని జగన్ హామీ ఇచ్చారని ఇజ్రాయిల్ చెప్పారు.
తీవ్ర విమర్శలకు దారితీసి..
ఇదిలా ఉండగా, బీచ్ ఫెస్టివల్‌కు రూ.కోట్లు ఖర్చు చేయడం సామాన్యుల్లో సైతం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నా బీచ్ అభివృద్ధి పేరుతో రూ.కోట్ల దుబారా చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎస్.యానాం బీచ్‌లో చేపట్టిన నిర్మాణాలు కూడా వృథాగా మారనున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ షెడ్డు, ఇతర నిర్మాణాలు కేవలం సంబరాల సమయంలో తప్ప ఇతర సందర్భాలలో నిరుపయోగమేనని స్థానికులు పెదవి విరుస్తున్నారు.
ఎంత ఖర్చు చేశారో చెప్పండి
ఎస్.యానాం బీచ్ ఫెస్టివల్‌లో అభివృద్ధి పనుల్లో అవకతవకాలు జరిగాయి. ఏ నిధులు ఎంత ఖర్చు పెట్టారు? సంబరాలకు వేసిన స్టాల్స్ వద్ద నుంచి, బయట వ్యక్తుల నుంచి వసూలు చేసిస సొమ్ము ఎంత? ఖర్చు ఎంత? అనేది శ్వేతపత్రం విడుదల చేయాలి. దీనిపై ఇప్పటి వరకూ ఎమ్మెల్యే ఆనందరావు ఎందుకు స్పందించలేదు. కానీ నాపై టీడీపీ నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు. తప్పు చేయకపోతే శ్వేతపత్రం ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది. ఇదే విషయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించాను. అవినీతిపై నిగ్గు తేల్చేందుకు పార్టీ నాయకులతో నిజ నిర్ధారణ కమిటీ వేస్తామని ఆయన తెలిపారు.
– బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్సీ


