
నేడు దివంగత వైఎస్సార్ వర్ధంతి
కోనసీమపై చెరగని ముద్ర
డెల్టా ఆధునీకరణ.. ఏటిగట్ల పటిష్టం
అన్నంపల్లి అక్విడెక్టు, బోడసకుర్రు బ్రిడ్జిల నిర్మాణం
పేదలకు ఇళ్లు.. పట్టణ పేదలకు రాజీవ్ గృహకల్ప ఏర్పాటు
సాక్షి, అమలాపురం: ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల నాలుగు నెలల కాలంలో సంక్షేమ సారథిగా.. అభివృద్ధి ప్రదాతగా రాష్ట్రంలోనే కాదు. దేశంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. పేద, బడుగు, బలహీన వర్గాల, రైతు, మహిళా పక్షపాతిగా చెరగని ముద్ర వేసుకున్నారు. పేదలకు అవసరమైన సంక్షేమ పథకాలే కాదు. రైతులకు మేలు చేసే ప్రయోజనాలు.. రోడ్లు.. వంతెనలు వంటి అభివృద్ధి కార్యక్రమాలను సైతం చేసి అభివృద్ధికి బాటలు వేశారు. చివరకు కోనసీమ ప్రజలకు వరదల నుంచి రక్షణ కల్పించడంతో పాటు లంక రైతులకు మాయని గాయం చేస్తున్న నదీకోతకు గ్రోయిన్లతో అడ్డుకట్ట వేశారు. అందుకే దివంగత మహానేత వైఎస్సార్ మరణించి నేటికి 16 ఏళ్లు కావస్తున్నా జనం గుండెల్లో చెరగని ముద్ర వేశారు. నేడు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా కథనం.
● అధ్వానస్థితికి చేరిన గోదావరి డెల్టా వ్యవస్థను పునర్నిర్మాణ పనులకు వైఎస్సార్ రూ.1,160 కోట్లు, అలాగే మురుగునీటి కాలువల ఆధునీకరణకు రూ.550 కోట్ల కేటాయించారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు 10.60 లక్షల ఎకరాల వరి ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు వెళ్లేందుకు, పంట చేల నుంచి ముంపు నీరు దిగేందుకు ఆయన చర్యలు చేపట్టారు.
● గోదావరికి భారీ వరదలు వచ్చిన ప్రతిసారీ ఏటిగట్లకు గండ్లుపడి కోనసీమకు జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం చెప్పలేనంత. 2006లో గోదావరికి రికార్డు స్థాయిలో వచ్చిన వరదల వల్ల జిల్లాలో అయినవిల్లి మండలం శానపల్లిలంక, పి.గన్నవరం మండలం మొండెపులంక వద్ద ఏటిగట్లకు గండ్లు పడడంతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. దీనిని గుర్తించిన వైఎస్సార్.. కోనసీమ జిల్లాలో బలహీనంగా ఉన్న ఏటిగట్ల పటిష్ట పనులకు రూ.550 కోట్లు కేటాయించగా, పనులు పూర్తయ్యే సమయానికి రూ.650 కోట్లకు చేరింది. ఆయన హయాంలోనే 70 శాతం పనులు పూర్తయ్యాయి.
● గోదావరి నదీ కోత నివారణకు రూ.90 కోట్లు కేటాయించి గ్రోయిన్లు, రివిట్‌మెంట్‌ల నిర్మాణాలు చేపట్టారు. అయినవిల్లి మండలం కొండుకుదురులంక, పొట్టిలంక కోతలు ఆగి ఇంకా ఆ గ్రామాలు ఉన్నాయంటే అందుకు వైఎస్సారే కారణం.
● వైఎస్సార్ హయాంలో ఉచిత విద్యుత్ వల్ల కొబ్బరి, అరటి, పసుపు, కూరగాయల పంటలు సాగు చేసే రైతులకు మేలు జరిగింది. ఇప్పటి వరకు ఈ పథకం అమలవుతూనే ఉంది. జిల్లాలో మొత్తం 20,452 వ్యవసాయ విద్యుత్ మోటార్లు ఉండగా, వీటిలో 11,901 పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందుతుందంటే అందుకు దివంగత నేత వైఎస్సార్ కారణం.
● ఐలాండ్ (ఐ.పోలవరం)కు సాగు నీరందించే అన్నంపల్లి అక్విడెక్టు శిథిలావస్థకు చేరడంతో దాని స్థానంలో రూ.48 కోట్లతో కొత్త అక్విడెక్ట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఆయన హయాంలో పనులు వేగంగా సాగాయి.
● అల్లవరం మండలం బోడసకుర్రు–మామిడికుదురు మండలం పాశర్లపూడి మధ్య వైనతేయ నదీ పాయపై వంతెనకు శంకుస్థాపన చేశారు. రూ.50 కోట్లు కేటాయించి పనులు మొదలు పెట్టించారు.
కోనసీమ నుంచే శ్రీకారం
రాజీవ్ గృహకల్పలో భాగంగా అమలాపురం మండలం నల్లమిల్లిలో సుమారు 240 మందికి ప్లాట్‌లు కట్టించారు. రాష్ట్రంలో మొదటిసారి ఈ కార్యక్రమానికి అమలాపురంలో శ్రీకారం చుట్టారు. ఇదే జిల్లా అల్లవరంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజీవ్‌నగర్ బాటను సైతం అమలాపురం మున్సిపాలిటీలో శ్రీకారం చుట్టారు.