
క్షణికావేశం.. తీరని శోకం
ఫ ఒత్తిడిని అధిగమించలేక ఆత్మహత్యలు
ఫ సమస్య ఏదైనా చావు పరిష్కారం కాదు
ఫ ఆలోచిస్తే పరిష్కారం లభిస్తుందంటున్న నిపుణులు
ఫ 10న ప్రపంచ ఆత్మహత్యల
నిరోధక దినోత్సవం
రాయవరం: సరిగ్గా చదవడం లేదని తండ్రి మందలించాడన్న కారణంతో మండలంలోని పసలపూడి శివారు సర్వారాయతోటలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి చెప్పిన మాటలను అర్థం చేసుకుని, ఆలోచించి ఉంటే జీవితం నిలబడేది. భర్త బలవన్మరణాన్ని తట్టుకోలేక కాకినాడకు చెందిన మహిళ జీవితంపై విరక్తితో జూలై 31న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తను లేకుంటే కుమారుడి పరిస్థితి ఏమవుతుందోనని భావించి కుమారుడికి కూడా పురుగుల మందు పట్టించింది. దీంతో ఇరువురు చికిత్స పొందుతూ తనువు చాలించారు.
ఇలా ప్రతిరోజూ చిన్న చిన్న సమస్యలకే పరిష్కార మార్గాలను అన్వేషించకుండా చావుతో ఫుల్‌స్టాప్ పెడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక కొందరు, వ్యసనాలకు బానిసలై మరికొందరు, బాధ్యతలు మోయలేక ఇంకొందరు, పంట చేతికి రాకున్నా.. పరీక్షల్లో తప్పినా.. ప్రేమ విఫలమైనా.. పెద్దలు కోప్పడినా కూడా మరణమే శరణ్యమంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సమస్య ఎంత జటిలమైనా ఒక్క క్షణం పాటు ఆలోచిస్తే.. పరిష్కార మార్గమో.. ప్రత్యామ్నాయమో కనిపిస్తుందని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. తమపై ఆధారపడ్డ వారి గురించి.. బంధువులు, ఆత్మీయుల గురించి ఆలోచిస్తే ఆత్మహత్య ఆలోచన నుంచి మనసు మారే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
ప్రధానంగా రెండు కారణాలు
చావుకు టాప్–10 కారణాల్లో ఆత్మహత్య కూడా ఒకటి. యువతీయువకుల్లో ఆత్మహత్యలు టాప్–3లో ఉంటాయి. వీరిలో ఆత్మహత్యలు చాలా కామన్‌గా ఉంటాయి. ఆత్మహత్యలకు పైకి కన్పించే కారణాలు, కన్పించని కారణాలు ఉంటాయి. ప్రేమవివాహాలు, ఆర్థిక పరిస్థితులు, మానవ సంబంధాలు తదితరాలతో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, కొంతమందికి కన్పించని కారణాలు ఉంటాయి. మెదడులో శిరోతోనిన్ అనే జీవరసాయన పదార్థంలో చోటుచేసుకునే మార్పుల కారణంగా కొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు. కొంతమంది చనిపోవడానికి నిర్ణయించుకుని చనిపోయిన వారు కొందరైతే, నేను ఎంత బాధపడుతున్నానో.. నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అనే మెసేజ్‌ను ఇవ్వడానికి కొంతమంది ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంటారు. ఆ విధంగా తమకు కావలసిన వారిలో సానుభూతి రప్పించడం కోసం ఆత్మహత్యలు చేసుకుంటారు. నిజంగా ఆత్మహత్యలు చేసుకునే వారి కంటే ఇటువంటి వారు ఐదు రెట్లు ఎక్కువగా ఉంటారని మానసిక వైద్యులు చెబుతున్నారు.
కౌన్సెలింగ్ సెంటర్ ద్వారా చికిత్స
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనజీమ జిల్లా కేంద్రం అమలాపురం ఏరియా ఆస్పత్రిలో మానసిక రుగ్మతలతో బాధపడే వారి కోసం కౌన్సెలింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఈ సెంటర్‌కు ఎక్కువగా మానసిక సమస్యలతో బాధపడేవారు వస్తున్నారు. రోజుకు 20 నుంచి 30 మంది వరకు నెలకు సుమారుగా 500 నుంచి 600 మంది వరకు కౌన్సెలింగ్ పొందుతున్నట్లు ఏరియా ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారు కూడా వారికి తెలియకుండానే ఆత్మహత్యలకు పాల్పడుతుంటారని సైక్రియాటిస్టులు చెబుతున్నారు. కేవలం చిన్న చిన్న కారణాలకు, ఒత్తిడిని భరించలేని స్థితిలో విద్యార్థులు, మహిళలు ఎక్కువగా ఆత్మహత్యే శరణ్యమని భావిస్తున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారిని ముందుగానే గుర్తించి కౌన్సెలింగ్ ఇప్పిస్తే ఆత్మహత్యలను నివారించవచ్చని సైక్రియాటిస్టులు చెబుతున్నారు. ఆత్మహత్యకు పాల్పడడానికి ప్రధానంగా ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు, వ్యసనాలకు బానిస కావడం, పరీక్షలు, ఓటమి భయం, ఒంటరితనం, సర్దుబాటు సమస్యలు, కుటుంబ సమస్యలు, అప్పులు తదితర కారణాలన్నీ ఆత్మహత్యలను ప్రేరేపిస్తున్నాయి. మానసిక సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చేందుకు ఇష్టపడని వారు 14416 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి బేసిక్ కౌన్సెలింగ్‌ను పొందే వీలుంది.
పురుషులే అధికం
ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో పురుషుల మరణాలే అధికంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. 52.8 శాతం మంది పురుషులు, 47.1 శాతం మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం. 33.3 శాతం మంది దిగులు, ఇతర కారణాలు, 10.6 శాతం పరీక్షలు, పని ఒత్తిడి, ప్రేమ విఫలం తదితర ఒత్తిడి కారణంగా, 11.4 శాతం మంది నిద్రలేమి కారణంగా, 10.6 శాతం మంది భయం, కంగారు తదితర కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 3.6 శాతం ఆత్మహత్యలు 12 సంవత్సరాల లోపు వారు, 6.3 శాతం మంది 13–17 సంవత్సరాల మధ్య వయస్సు వారు, 67.6 శాతం మంది 18–45 సంవత్సరాల వారు, 17.4శాతం మంది 46–64 మధ్య వయస్సు వారు, 5.1 శాతం మంది 65 ఏళ్ల పైబడిన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి.
ఒక్క క్షణం ఆగితే ప్రపంచం మీదే
చనిపోయినంత మాత్రాన సమస్య తీరదు. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. బాధ్యతలు మోస్తున్నప్పుడు సమస్యలు రాక మానవు. అలాంటి సమయంలో ఇతరుల నుంచి సహాయాన్ని తీసుకోవాలి. సమస్య పరిష్కారానికి అన్ని మార్గాలను అన్వేషించాలి. ఆత్మహత్యలకు పాల్పడడం పిరికితనమే. ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆగితే ప్రపంచం మీదే.
– బి.రఘువీర్,
డీఎస్పీ, రామచంద్రపురం
మానసిక సమస్యలతోనే ఆత్మహత్యలు
ఆత్మహత్యాయత్నం ఓ మానసిక సమస్య. ఆత్మహత్యకు పాల్పడే వ్యక్తి ముందు ఒంటరితనాన్ని కోరుకుంటారు. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. అటువంటి వారిని ముందుగా గుర్తించి చికిత్స చేయించడం అత్యవసరం. వారిని నెమ్మదిగా నలుగురిలోకి తీసుకువెళ్లాలి. జీవితంపై ఆసక్తి కలిగించేలా చూడాలి. అప్పుడే ఆత్మహత్య ఆలోచనను దూరం చేయవచ్చు.
– డాక్టర్ సౌమ్య, సైక్రియాటిస్ట్, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, అమలాపురం
07ఎండీపీ121ఎ:
07ఎండీపీ121