
నాడు రక్ష.. నేడు కక్ష
ఆలమూరు: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ.. ప్రభుత్వ పారదర్శకత పాలనకు నిలువుటద్దం.. కోవిడ్–19 సమయంలో ప్రాణాలకు తెగించి గ్రామ వలంటీర్ల వ్యవస్థతో కలసి ప్రజలకు విస్తృత సేవలను అందించిన చరిత్ర గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఉంది. క్షేత్రస్థాయిలోని ప్రజలు తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన దుస్థితిని ప్రజా సంకల్పయాత్రలో గుర్తించిన వైఎస్ జగన్ ఆ మేరకు సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. అందులో భాగంగా 2019 మే 30న అధికారం చేపట్టిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రభుత్వానికి భారమైన లెక్క చేయకుండా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. దీంతో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన కోసం 2019 అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు. ఒక్కో గ్రామ సచివాలయంలో 11 నుంచి 14 మంది ఉద్యోగులను నియమించి మండల, జిల్లా కేంద్రాల్లో లభించే సేవలను కూడా గ్రామ సచివాలయాల్లో అందించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ఏ విధమైన ఒత్తిడి లేకుండా తమ యథావిఽధి పనులకు భంగం కలగకుండా సమాంతరంగా గ్రామ వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజా పాలనను సులభతరం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఎటువంటి అవినీతికి, ఆర్థిక దుర్వినియోగానికి తావులేకుండా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు వేగవంతమైన సేవలను అందిస్తూ జవాబుదారీతనం కల్పించిన ఘనత మాజీ సీఎం జగన్‌కే దక్కుతుంది.
దీర్ఘకాలిక ఉద్యమం తప్పనిసరి
రాష్ట్ర ప్రభుత్వం ఇకనుంచైనా సచివాలయ ఉద్యోగ వ్యవస్థపై పక్షపాత వైఖరిని మానుకోకుంటే భవిష్యత్‌లో దీర్ఘకాలిక ఉద్యమం తప్పదని జిల్లా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ ఐక్యవేదిక ప్రకటించింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి విధులను నిర్వహించడంతో పాటు దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలని, పనిభారాన్ని తగ్గించాలని మండల, గ్రామ స్థాయి అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. ప్రభుత్వం ఏ విధమైన ఒత్తిడి తీసుకువచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ వాట్సాప్ గవర్నెన్స్ వంటి ప్రజలకు ఉపయోగం లేని వృథా సేవలను అందించలేమని తేల్చి చెప్పింది.
మానసిక వ్యధ
రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఓ పక్క గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆత్మాభిమానాన్ని చంపుకోలేక, మరో పక్క జీవనాధారమైన ఉద్యోగాన్ని వదులుకోలేక మానసిన వ్యధను అనుభవిస్తున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగ బాధ్యతలతో పాటు గతంలో నలుగురు గ్రామ వలంటీర్లు చేపట్టే విధులను కూడా అప్పగించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల ఐదున మళ్లీ వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రతి రెండు గంటలకు ప్రగతిని, లక్ష్యాన్ని సెల్‌ఫోన్ ద్వారా గూగుల్ ద్వారా నిక్షిప్తం చేయాలని సూచించింది.
ప్రజలకు అవసరం లేకపోయినా బలవంతంగా క్షేత్రస్థాయిలో ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు ఇవ్వడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక మంది ఉద్యోగులు పని ఒత్తిడి, వేధింపులతో తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లిపోయారు. మూడంకెల వేతనాన్ని పొందుతున్నా సర్కార్ కొలువు కావడంతో పాటు అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మీద ఉన్న నమ్మకంతో అరకొర వేతనానికే ఉద్యోగాల్లో చేరామని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు.
ప్రభుత్వం మారింది..
పాలన తిరోగమించింది
ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రస్తుతం అస్తవ్యస్తంగా తయారైంది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో క్షేత్రస్థాయిలోని ప్రజలకు సక్రమంగా అందే పరిస్థితి లేకుండా పోయింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 515 గ్రామ, వార్డు సచివాలయాలుండగా అందులో 467 గ్రామ, 48 వార్డు సచివాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం 3992 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థపై ఉన్న అక్కసును ప్రతీకారంగా మార్చుకుంది. రేషనలైజేషన్ పేరిట జిల్లా వ్యాప్తంగా అడ్డగోలు బదిలీలు చేపట్టింది. ఒక్కో సచివాలయంలో పనిచేసే టెక్నికల్ అసిస్టెంట్లకు రెండు లేదా మూడు గ్రామ సచివాలయాల బాధ్యతలను అప్పగించింది. దీనికి తోడు కూటమి ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా తొలగించిన 8972 మంది గ్రామ వలంటీర్ల బాధ్యతలను కూడా సచివాలయ ఉద్యోగులకు అప్పగించి విపరీతమైన పనిభారాన్ని ప్రభుత్వం పెంచేసింది. ఇప్పటికే గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆధార్ నుంచి అనేక సేవలను అందిస్తుండగా ఇది చాలదన్నట్టు మళ్లీ సుమారు 500 రకాల వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే అలుసుగా తీసుకున్న మండల స్థాయి అధికారులు మూడు లేదా నాలుగు క్లస్టర్లను మ్యాప్ చేసి ఒక్కో సచివాలయ ఉద్యోగికి అప్పగించింది. ఒక్కో సచివాలయ పరిధిలో 20 నుంచి 50 మంది గ్రామ వలంటీర్లు చేసే పనినంతా కేవలం ఐదు నుంచి 11 మంది ఉద్యోగులపై భారం వేసి ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వం పక్షపాత వైఖరిని అవలంబిస్తుంది.
కుటుంబానికి సేవలు అవసరం ఉన్నా లేకపోయినా వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై అవగాహన కల్పించాలని లేదా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్రస్థాయి అధికారులే నేరుగా తమ అనధికార ఆదేశాలతో భయపెడుతున్నారని సచివాలయ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
సచివాలయాల ద్వారా అందుతున్న
ప్రధాన సేవలు
01) సామాజిక పింఛన్ల పంపిణీ
02) జియో ట్యాగింగ్ సర్వే
03) నాన్ ఏపీ రెసిడెంట్స్ సర్వే
04) అప్డేట్ ఈ–కేవైసీ
05) చిల్డ్రన్ వితౌట్ ఆధార్
06) మన మిత్ర
07) ఇది మంచి ప్రభుత్వం
08) వాహన్ ఆధార్ సీడింగ్
09) మేండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్
10) యోగాంధ్ర
11) వర్క్ ఫ్రం హోమ్ సర్వే
12) పీ–4 సర్వే
13) కౌశలం సర్వే
14) రేషన్ కార్డు (ఈ–కేవైసీ)
15) రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్
వలంటీర్ వ్యవస్థను తొలగించింది మొదలు.. వారు చేసే పనులన్నీ సచివాలయ ఉద్యోగులపైనే వేశారు. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో నాడు ఎంతో రక్షణగా పని నిర్వర్తించే ఉద్యోగులు.. నేడు ఆ సర్వేలు, ఈ సర్వేలు అంటూ కూటమి కక్ష కట్టి ఊరంతా తిప్పుతోంది. కూటమి వచ్చి ఏడాది కాగానే ఎన్నో డిపార్ట్‌మెంట్లలో ఏళ్లకు ఏళ్లు పాతుకుపోయిన ఉద్యోగులతో పాటే ఐదేళ్లు పూర్తయిందనే సాకుతో వీరినీ పక్క మండలాలకు బదిలీలు చేశారు. పీ–4 అంటూ ఎన్నో బాధ్యతలు నెత్తిన పెట్టారు. కానీ ఇవ్వాల్సిన, రావాల్సిన సదుపాయాల గురించి మాట్లాడితే మాత్రం వాటిపై యథా బాబు.. తథా డాబు అంటూ సతాయిస్తున్నారు. ఇలా మానసిక వ్యథ అనుభవిస్తూ ఉద్యోగాలను ఈడ్చుకొస్తున్నారు.
ఫ సచివాలయ వ్యవస్థపై ఎందుకంత కక్ష
ఫ రోజురోజుకూ పని భారం పెంచేస్తున్న ప్రభుత్వం
ఫ సర్కార్ సేవల కంటే పార్టీ ప్రచారానికే ప్రాధాన్యం
ఫ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన బాటలో ఉద్యోగులు

నాడు రక్ష.. నేడు కక్ష