విలేకరులతో మాట్లాడుతున్న సీఐ గోవిందరాజు
రాజమహేంద్రవరం సిటీ: సంక్రాంతి పర్యదినాన్ని పురస్కరించుకుని ఈనెల 15, 16వ తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. నాందేడ్ – కాకినాడ టౌన్ (07487/88) మధ్య తిరిగే ఈ రైళ్లు రాజమహేంద్రవరం, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయన్నారు. వీటిని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.
దూరవిద్యలో ప్రవేశాలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2023 – 24 సంవత్సరానికి దూరవిద్యలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ఆ స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్ సీహెచ్ శ్రీనివాసులు బుధవారం తెలిపారు. డిగ్రీ, పీజీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ కోర్సుల్లో మొదటి, రెండు, మూడో సంవత్సర ప్రవేశాలు పొందేందుకు గడువు ఈనెల 31తో ముగుస్తుందన్నారు. సంబంధిత విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని వాటిని స్టడీ సెంటర్‌లో అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు 73829 29614 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
154 కోడి కత్తుల స్వాధీనం
రాజోలు: సర్కిల్ పరిధిలో 154 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ ఆర్.గోవిందరాజు తెలిపారు. ఆయన బుధవారం రాజోలు సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎస్పీ ఎస్.శ్రీధర్ ఆదేశాలపై కొత్తపేట డీఎస్పీ కేవీ రమణ పర్యవేక్షణలో సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు ఎస్సైలు ఎస్.రాము, బి.సంపత్, జి.పృథ్వీలకు వచ్చిన సమాచారం ఆధారంగా ఈ చర్యలు చేపట్టామన్నారు. సంక్రాంతి పండగ పేరుతో అనధికారికంగా జూదాలు నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయన్నారు. కోడి పందేలు నిర్వహించిన వారిని, పాత కేసుల్లో ముద్దాయిలను బైండోవర్ చేస్తామన్నారు. సంప్రదాయం పేరుతో అశ్లీల నృత్యాలను ప్రదర్శించినా, నిర్వహింపచేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


