అల్లవరం: అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అనకాపల్లిలో గ్రామ దేవత జాతరలో ఓ దళిత కళాకారుడిని విచక్షణారహితంగా చెంపపై కొట్టి, దాడి చేయడం అమానుషమని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతరలో పదుల సంఖ్యలో పోలీసులున్నా ప్రేక్షక పాత్ర పోషించడం విడ్డూరంగా ఉందన్నారు. హోం మంత్రి అనిత దళితురాలైనప్పటికీ ఈ ఘటనపై స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఈవిధంగా ప్రవర్తించడం సిగ్గుచేటని, స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై తక్షణం ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి, బాధితుడికి న్యాయం చేయాలని ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు. దీనిపై న్యాయం జరిగే వరకూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యాన పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులకు
నేడు సత్కారం
రావులపాలెం: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కాలం నుంచి గ్రామాల్లో సేవలందిస్తున్న ప్రజాప్రతినిధులకు శనివారం సత్కారం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి శుక్రవారం తెలిపారు. కొత్తపేట నియోజకవర్గంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులుగా, ఎంపీపీలుగా, సర్పంచులుగా, వార్డ్ మెంబర్లుగా, సొసైటీ అధ్యక్షులుగా సేవలందించిన వారందరినీ సత్కరిస్తామన్నారు. ఉదయం 9 గంటలకు పార్టీ పెద్దలతో కలసి రావులపాలెంలోని పార్టీ కార్యాలయం నుంచి సీఆర్‌సీ ఫంక్షన్ హాలు వరకూ వెళ్తామన్నారు. అనంతరం సన్మానాలు నిర్వహిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జగ్గిరెడ్డి కోరారు.
ఉత్కంఠగా చెస్ పోటీలు
అమలాపురం టౌన్: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యాన స్థానిక విద్యానిధి స్కూలులో అండర్–11 జిల్లా స్థాయి చెస్ పోటీలు శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగాయి. 40 మందికి విద్యార్థులు పైగా పాల్గొన్నారు. బాలికల విభాగంలో అమలాపురం రూరల్ ఈదరపల్లికి చెందిన అడబాల ప్రావీణ్యశ్రీ ప్రథమ, ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లికి చెందిన బొడ్డు సాన్వి ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. బాలుర విభాగంలో కొత్తపేట మండలం వానపల్లికి చెందిన కాట్నం కేతన్ ప్రహాస్ ప్రథమ, ద్రాక్షారామకు చెందిన కంచి శివరామరాజు ద్వితీయ స్థానాలు సాధించారు. విజేతలకు ప్రిన్సిపాల్ టి.మాధవి బహుమతులు, ధ్రువీకరణ పత్రాలు అందించారు. జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి తాడి వెంకట సురేష్ కూడా పాల్గొన్నారు.
రైల్వే రిక్రూట్‌మెంట్
పరీక్షలకు శిక్షణ
అమలాపురం రూరల్: రైల్వే రిక్రూట్‌మెంట్ గ్రూప్–డి పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ సాధికారత అధికారి ఎం.జ్యోతిలక్ష్మీదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 100 మంది అభ్యర్థులకు 2 నెలల పాటు ఉచిత శిక్షణతో పాటు స్టెపెండ్, స్టడీ మెటీరియల్ అందిస్తామని వివరించారు. పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు. ఎంపికై న వారికి ఈ నెల 10వ తేదీ నుంచి ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామన్నారు. బయోడేటా, పదో తరగతి మార్కుల జాబితా, ఇతర అన్ని పత్రాలు, 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో ఈ నెల 8 లోగా తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్ష లోపు ఉండాలని జ్యోతిలక్ష్మీదేవి స్పష్టం చేశారు.
బీసీలకు రక్షణ చట్ట చేయాలి
అమలాపురం టౌన్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం బీసీలకు తక్షణమే రక్షణ చట్టాన్ని చేయాలని భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మట్టా వీరబాబు గౌడ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల రక్షణకు చట్టం, రాజధానిలో బీసీలకు వెయ్యెకరాల కేటాయింపు, అన్ని బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణన, విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థలు, చట్టసభల్లో 44 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. వీటిపై ఈ నెల 10 నాటికి స్పష్టమైన హామీ ఇవ్వకుంటే 11న విజయవాడలో ఆమరణ దీక్షలు చేస్తామని చెప్పారు. బీసీ నాయకుడు మట్టపర్తి సూర్యచంద్రరావు కూడా మాట్లాడారు.


