బేరం కుదరలేదు కదూ! | - | Sakshi
Sakshi News home page

బేరం కుదరలేదు కదూ!

Apr 4 2026 7:31 AM | Updated on Apr 4 2026 7:31 AM

సాక్షి, అమలాపురం/రావులపాలెం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన ఇసుక ర్యాంపులు కొత్తపేట, మండపేట నియోజకవర్గాల పరిధిలోనే ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం కలెక్టర్‌ నేతృత్వంలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీ అనుమతులిచ్చిన సెమీ మెకనైజ్డ్‌ రీచ్‌లు 11 ఉన్నాయి. వీటిలో నాలుగింటికి ఈ ఏడాది డిసెంబర్‌ నెలాఖరు వరకూ, మిగిలిన వాటికి మే నెలాఖరు వరకూ అనుమతి ఉంది. ఈ 11 రీచ్‌లలో సుమారు 26 లక్షల మెట్రిక్‌ టన్నుల పరిమాణంలో ఇసుక అందుబాటులో ఉందని అంచనా. ఇది కాకుండా ఐదు స్టాక్‌ పాయింట్లు వద్ద 4.63 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత రియల్‌ ఎస్టేట్‌ రంగం సంక్షోభంలో కూరుకుపోవడంతో పాటు, భవన నిర్మాణ రంగం కుదేలైంది. ఫలితంగా ఇసుకకు డిమాండ్‌ లేకుండా పోయింది.

దాడులు అందుకేనా..!

ఇదే సమయంలో రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా ర్యాంపులపై అధికారులు దాడులు చేస్తున్నారు. ఇసుక రీచ్‌ల కో ఆర్డినేట్స్‌, తవ్వకాల నియమనిబంధనలు.. అమ్మకాల తీరును పరిశీలించారు. అనుమతులున్న రీచ్‌లలోనే కాకుండా ఆత్రేయపురం, ఆలమూరు, గోపాలపురం ప్రాంతాల్లో కూడా ఈ తనిఖీలు జరిగాయి. కాకినాడ భూగర్భ గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ బి.జగన్నాథరావు, ఏలూరు మైన్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీ) వెంకటరత్నం, కోనసీమ జిల్లా మైన్స్‌ ఏడీ బి.అశోక్‌ కుమార్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌, మైనింగ్‌ సిబ్బందితో కలిసి ఈ తనిఖీలు చేశారు. ర్యాంపులపై పలు ఫిర్యాదులు రావడంతో ఈ తనిఖీలు చేశామని ఏడీ అశోక్‌ కుమార్‌ చెప్పారు. అయితే, ఇసుక దోపిడీ విచ్చలవిడిగా సాగుతున్న సమయంలో కాకుండా, ఇప్పుడు దాడులు చేయడమేమిటనే అనుమానాలు సామాన్యుల్లో వ్యక్తమవుతున్నాయి. కూటమి నేతల మధ్య వాటాలు తేలకపోడమే దీనికి అసలు కారణమని తేలింది.

ఇద్దరు నేతల హవా

జిల్లాలో అధికారిక ఇసుక ర్యాంపులు కొత్తపేట, ఇప్పుడు తూర్పు గోదావరి పరిధిలోకి వెళ్లిన మండపేట నియోజకవర్గాల్లో మాత్రమే ఉన్నాయి. అనధికారిక ర్యాంపులు పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాలు కేంద్రాలుగా సాగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటికే స్టాక్‌ పాయింట్లలో నిల్వ చేసి ఉంచిన ఇసుకను దొడ్డిదారిన అమ్ముకోవడం నుంచి నేటి వరకూ ఇద్దరు కీలక నేతల హవా సాగుతోంది. ఇసుక ర్యాంపులకు అనుమతి వచ్చిన తరువాత కూడా వీరిదే హవా. కొత్తపేట, మండపేట నియోజకవర్గాల్లో ఉచిత ఇసుక మీద బీ, వీ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు. దీనికితోడు అనధికారిక ఇసుక తవ్వకాలు జరుగుతున్న పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాలకు చెందిన కీలక నేతలకు సైతం సిండికేటులో వాటాలందుతున్నాయి. ఇక్కడి వరకూ బాగానే ఉంది. అయితే, కొత్తపేట మండలం మందపల్లి – కపిలేశ్వరపురం ర్యాంపు వద్ద సరిహద్దు వివాదం తాజా ఇసుక తుపానుకు కారణమైంది.

ఆలమూరు ర్యాంపుతో విభేదాలు

ఫ కోనసీమ ఇసుక దందాలో కొత్త మలుపు

ఫ ఇప్పటికే ‘బీ’ వర్సెస్‌ ‘వీ’

ఫ తాజాగా టీడీపీ,

జనసేన నేతల రంగప్రవేశం

ఫ మందపల్లి ర్యాంపుపై వివాదం

ఫ మందపల్లి పేరు చెప్పి

కపిలేశ్వరపురంలోనూ తవ్వకాలు

ఫ సీఎంఓను తాకిన ఇసుక తుపాను

ఫ ఫలితంగానే అధికారుల దాడులు

ఇసుక తుపాను హెచ్చరిక.. మందపల్లి – కపిలేశ్వరపురం ర్యాంపుల మధ్య మొదలైన తీవ్ర ఇసుక తుపాను.. క్రమంగా బలపడి దక్షిణ నైరుతి దిశగా పయనించి ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని (సీఎంఓ) తాకింది. సిండికేటు మధ్య పొరపొచ్చాలు.. ఇద్దరు నేతల మధ్య తెగని వాటాల వివాదం.. కొత్తగా మరో ఇద్దరి రంగప్రవేశం.. సీఎంఓకు చేరిన వివాదం.. ఫలితంగా అధికార, అనధికార ర్యాంపులపై అధికారుల దాడుల వరకూ వ్యవహారం వచ్చింది. ఈ ఇసుక తుపాను ప్రభావంతో రాగల కొన్ని రోజుల పాటు జిల్లాలోని కూటమి నేతల మధ్య మరింత దుమారం రేగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సాఫీగా సాగిపోతున్న ఇసుక సిండికేటులో విభేదాలకు ఆలమూరు ర్యాంపు కారణమైంది. ఇది అధికారికంగా ఆలమూరు పేరుతో ఉన్నప్పటికీ ఈ ర్యాంపునకు వెళ్లేందుకు దారి లేదు. దీంతో, కొత్తపేట మండలం మందపల్లి మీదుగా రహదారి సౌకర్యం కల్పించారు. ఇదే అదనుగా ఆలమూరు ర్యాంపు జియో కో ఆర్డినేట్స్‌ దాటి మందపల్లి, పక్కనే ఉన్న కపిలేశ్వరపురం పరిధిలో కూడా తవ్వకాలు మొదలు పెట్టారు. ఇక్కడ ఇసుకతో పాటు లంక దిబ్బను కూడా తవ్వేస్తున్నారు. ఈ తవ్వకాలకు అనుగుణంగా వాటాల శాతంలో మార్పులు చేయాలని పట్టుబట్టడమే ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలకు కారణమైంది. ఇది కాస్తా మైనింగ్‌ అధికారులకు ఫిర్యాదులు చేసుకునేంత వరకూ వెళ్లింది. చివరకు ఈ వివాదం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. దీంతో, అసలు ఇక్కడ జరుగుతున్న ఇసుక దందాపై పూర్తి వివరాలు కావాలని ఉన్నత వర్గాల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అధికారిక, అనధికారిక ఇసుక ర్యాంపులపై మైనింగ్‌, ఇరిగేషన్‌, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. ఇదిలా ఉండగా వీ, బీ వివాదాలకు అదనంగా వాటాల కోసం కొత్తపేటకు చెందిన ఒక కీలక టీడీపీ నేత, మండపేటకు చెందిన జనసేన పార్టీకి చెందిన నాయకులు కూడా రంగప్రవేశం చేయడంతో వివాదం మరింత ముదిరింది. తమకు కూడా వాటాలు ఇవ్వాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. ఒకవైపు అధికారుల దాడులకు తోడు మరోవైపు నేతల మధ్య వాటాల పంచాయితీ కాస్తా తమ పుట్టి ముంచేలా ఉందని సిండికేట్‌లోని మిగిలిన పాటదారులు ఆందోళనతో ఉన్నారు. మొత్తం మీద ఈ పంచాయితీ సీఎంఓలో తేలితేనే కానీ, ఇసుక తుపాను తీరం దాటే అవకాశాలు కనిపించడం లేదు. ఈ వివాదం బహిరంగమవడంతో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ సాగుతున్న ఇసుక దందాపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement