రాయవరం: గత నెల 16న ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 2న ఇంగ్లిషు పరీక్షతో ముగిశాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని 391 కేంద్రాల్లో ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ మూడు జిల్లాల పరిధిలో రెగ్యులర్, ప్రైవేటుగా మొత్తం 72,797 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, సగటున 99.48 శాతం మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 2022 విద్యా సంవత్సరం వరకూ ఉమ్మడి జిల్లా కేంద్రం కాకినాడలో జవాబు పత్రాల మూల్యాంకనం జరిగేది. 2023 నుంచి కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో స్పాట్ వాల్యుయేషన్ చేపడుతున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వచ్చిన పరీక్ష పేపర్ల కోడింగ్ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. కాకినాడలో సాలిపేట మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్, కోనసీమ జిల్లాలో అమలాపురం బాలుర ఉన్నత పాఠశాల, తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం శ్రీరామ్ నగర్‌లోని బీవీఎం హైస్కూల్‌లో మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టనున్నారు.
జిల్లాలకు చేరిన జవాబు పత్రాలు
వివిధ జిల్లాల నుంచి వచ్చిన 5,43,694 జవాబు పత్రాలకు ఉమ్మడి మూల్యాంకనం చేపట్టనున్నారు. ఇందులో కాకినాడ జిల్లాలో 1,85,811, తూర్పు గోదావరి జిల్లాలో 1,76,106, కోనసీమ జిల్లాలో 1,81,777 చొప్పున జవాబు పత్రాలున్నాయి. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకూ ఈ ప్రక్రియను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఇప్పటికే జవాబు పత్రాలు ఆయా జిల్లాలకు దాదాపు చేరుకున్నాయి. ఆయా జిల్లాలకు జిల్లా విద్యా శాఖ అధికారులు క్యాంప్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. జవాబు పత్రాల మూల్యాంకనంలో డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్లు, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు, చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లు పాల్గోనున్నారు.
సబ్జెక్టుల వారీగా..
తెలుగు, హిందీ, ఇంగ్లిషు, గణితం, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, సంస్కృతం, ఒకేషనల్ సబ్జెక్టులకు చెందిన జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతుంది. మూల్యాంకన విధులకు ఆయా సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను నియమిస్తూ ఇప్పటికే లీప్ యాప్ ద్వారా ఉపాధ్యాయులకు నేరుగా ఉత్తర్వులు అందజేశారు. ఆరు సబ్జెక్టులు, ఒకేషనల్ పరీక్షలు కలిపి మొత్తం పది రోజుల పాటు మూల్యాంకనం జరుగుతుంది.
ఇవీ నిబంధనలు
ఫ మూల్యాంకన విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులు సెల్‌ఫోన్, స్మార్ట్‌ఫోన్లు, వైట్‌నర్, ఎరేజర్ తదితర వస్తువులను తీసుకుని వెళ్లరాదు.
ఫ మూల్యాంకన సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎటువంటి తప్పిదాలు జరిగినా బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఫ శిబిరానికి నిర్దేశిత సమయాల్లో హాజరు కాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.
స్పాట్‌కు జిల్లాల వారీగా నియామకాలు ఇలా..
కేటగిరీ తూర్పు గోదావరి కాకినాడ కోనసీమ
డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్లు 1 1 1
స్ట్రాంగ్ రూమ్ ఇన్‌చార్జి 1 1 1
అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు 8 7 8
ఏఏసీఓలు 8 7 8
చీఫ్ ఎగ్జామినర్లు 100 79 79
అసిస్టెంట్ ఎగ్జామినర్లు 453 476 483
స్పెషల్ అసిస్టెంట్లు 267 237 242
ఫ 6 నుంచి 15 వరకూ
టెన్త్ స్పాట్ వాల్యుయేషన్
ఫ ఉమ్మడి జిల్లాలో
5.44 లక్షల జవాబు పత్రాలు
ఫ ఇప్పటికే లీప్ యాప్‌లో ఉత్తర్వులు
ఫ ఏఈలు, సీఈలు,
స్పెషల్ అసిస్టెంట్లకు నేడు శిక్షణ
పొరపాట్లకు తావు లేకుండా..
స్పాట్ వాల్యుయేషన్ విధులకు నియమితులైన వారు తప్పనిసరిగా హాజరు కావాలి. ఎవ్వరికీ మినహాయింపు ఉండదు. మూల్యాంకన విధులకు హాజరయ్యే వారు కచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలి.
– జి.నాగమణి, రీజినల్ జాయింట్ డైరెక్టర్,
పాఠశాల విద్యా శాఖ, కాకినాడ


