దిగుబడుల దీపావళి | Sakshi
Sakshi News home page

దిగుబడుల దీపావళి

Published Sat, Nov 11 2023 2:42 AM

సామర్లకోట మండలం జి.మేడపాడులో ధాన్యాన్ని రాశులుగా పోస్తున్న రైతులు - Sakshi

కలిసొచ్చిన వాతావరణం

వాతావరణం అనుకూలించడం కలిసొచ్చింది. మునుపటి కంటే తెగుళ్లు బాగా తగ్గాయి. పెట్టుబడులు పెరిగినా పంట బాగా పండింది. గత ఖరీఫ్‌ సీజన్‌తో పోలిస్తే దిగుబడి బాగా పెరిగింది. ఎకరాకు 35 నుంచి 40 బస్తాల దిగుబడి వస్తోంది. ఇంత వస్తుందని అనుకోలేదు. మాసూళ్లు చేసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయడంతో ఊరటగా ఉంది. రైతుభరోసా కేంద్రాలు చొరవతో పని చేస్తున్నాయి.

– అన్నందేవుల చంద్రరావు,

చైర్మన్‌, ఆర్‌బీకే మండల కమిటీ,

కేశవరం, మండపేట

తొలకరి ఆశాజనకం

తొలకరి పంట ఆశాజనకంగా ఉంది. సీజన్‌ ఆరంభంలోను, సాగునీటి ఇబ్బందులు ఎదురైనా ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చొరవతో సాగునీటి కష్టాలు తప్పాయి. కూలి రేట్ల నుంచి ఎరువులు, పురుగు మందుల రేట్లు పెరిగిపోవడంతో సార్వా పెట్టుబడులు పెరిగిపోయాయి. ఇంతవరకూ ఎకరాకు రూ.28 వేల పెట్టుబడి పెట్టాం. కోతలు, మాసూళ్లకు మరో రూ.ఐదారు వేలు అవుతుంది. ఎకరాకు 30 నుంచి 40 బస్తాల దిగుబడి వస్తుంది. హమాలీలు, రవాణా చార్జీలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తూండటం సంతోషంగా ఉంది.

– రెడ్డి వీరభద్రరావు, రైతు, కరప

సాక్షి ప్రతినిధి, కాకినాడ: రైతు కుటుంబాల్లో దీపావళి వెలుగుల జోష్‌ కనిపిస్తోంది. ఖరీఫ్‌ దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ ప్రోత్సాహంతో అధిగమించారు. సాగునీరు, విత్తనాలు, ఎరువులను ప్రభుత్వ యంత్రాంగం సకాలంలో అందించడం ఈసారి రైతులకు బాగా కలిసి వచ్చింది. సీజన్‌ ప్రారంభంలో కొంత ప్రతికూల వాతావరణం కనిపించినా చివరిలో దిగుబడులు ఆశాజనకంగా ఉండటం ఊరటనిచ్చింది. ప్రస్తుతం రైతులు మాసూళ్లలో బిజీగా ఉన్నారు. చేతికంది వచ్చిన పంటను కళ్లాల్లోనే మద్దతు ధరకు అమ్మేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇటు మెట్ట, అటు డెల్టా అనే తేడా లేకుండా ముందుగా ఊడ్పులు జరిగిన ప్రాంతాల్లో వ్యవసాయ పనులతో సందడి వాతావరణం కనిపిస్తోంది.

కోతలు వేగంగా పూర్తి

ఏటా మాదిరిగానే మెట్ట ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు కొంత ఇబ్బంది కలిగించాయి. అయినా గోదావరి మధ్య, తూర్పు డెల్టాల పరిధిలోని ఆయకట్టు, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని మెట్ట ప్రాంత మండలాల్లో ఖరీఫ్‌ దిగుబడులు ఆశాజనకంగా వస్తున్నాయి. కాకినాడ రూరల్‌, కరప, సామర్లకోట, పెద్దాపురం, జగ్గంపేట, గోకవరం, గండేపల్లి, ముమ్మిడివరం, కొత్తపేట, మండపేట, రాజమహేంద్రవరం రూరల్‌, కడియం, అనపర్తి, రాజానగరం, కొవ్వూరు తదితర మండలాల్లో వరి నూర్పిళ్లు వేగంగా జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం రూరల్‌లో 50 శాతం పైగా కోతలు పూర్తయ్యాయి. రాజానగరం, అనపర్తి, సీతానగరం, కొవ్వూరు, చాగల్లు మండలాల్లో వరి మాసూళ్లు నాలుగైదు రోజులుగా ముమ్మరంగా సాగుతున్నాయి. కోతలు పూర్తి చేసిన రైతులు ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టి అటు నుంచి అటే రైతు భరోసా కేంద్రాలకు తరలిస్తున్నారు. మద్దతు ధరకు అమ్ముకుంటున్నారు. గత ఏడాది ఇదే సీజన్‌లో మద్దతు ధర 75 కిలోల బస్తా రూ.1,530. దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్‌లో రూ.1,637కు పెంచడంతో గొప్ప మేలు జరుగుతోందని రైతులు సంబరపడుతున్నారు.

ఇక్కడ దీపావళి సెంటిమెంటు

ఖరీఫ్‌లో ముందుగా నాట్లు వేసే మండపేట, రామచంద్రపురం, కొత్తపేట నియోజకవర్గాల్లో ఇప్పటికే వరి కోతలు మొదలయ్యాయి. ఈ మండలాలతో సెంట్రల్‌ డెల్టాలో రైతులు దీపావళి సెంటిమెంట్‌తో వచ్చే బుధవారం నుంచి మాసూళ్లు ముమ్మరం చేస్తారంటున్నారు. దిగుబడులు బాగుండటం వారికి ఊరటనిస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ప్రతికూల రైతులను ఆందోళనకు గురిచేస్తున్నా మాసూళ్లకు ధైర్యంగా సిద్ధపడుతున్నారు. వారం పది రోజులు వాతావరణం అనుకూలిస్తే తొలకరి గట్టెక్కుతుందని ఆశ పడుతున్నారు.

పంట కోత ప్రయోగాల లెక్కలు

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో క్షేత్ర స్థాయిలో ఇంతవరకూ జరిగిన 180 పంట కోతల ప్రయోగాలు పరిశీలిస్తే ఎకరాకు 35 నుంచి 38 బస్తాల వరకూ దిగుబడి వస్తోందని లెక్కలేశారు. కొన్ని పొలాల్లో 40 బస్తాలు వచ్చే అవకాశముంది. ఈ దిగుబడులు చూసి రైతులు ఆనందపడుతున్నారు. నాట్ల నుంచి మాసూళ్ల వరకూ ఎకరాకు రూ.26,000 నుంచి రూ.28,000 వరకూ పెట్టుబడులు అయ్యాయి. తెగుళ్ల బెదడ తక్కువ, వాతావరణం అనుకూలించడంతో దిగుబడి ఆశాజనకంగా ఉంది. 60 శాతం సాగు కౌలు రైతుల చేతుల్లోనే ఉంది. వీరు ఎకరాకు 12, 15 బస్తాలు వంతున కౌలుకు తీసుకున్నారు. కౌలు, పెట్టుబడులు పోను అంటే ఎకరాకు రూ.30 వేలు కొద్దిగా అటుఇటుగా ఆదాయం రావడం ఆనందంగా ఉందంటున్నారు.

మండపేటలో కళ్లాల నుంచే ధాన్యం బస్తాలను ట్రాక్టర్‌లపై తరలిస్తోన్న రైతులు

రైతు కళ్లలో ఆనందకాంతులు

ఖరీఫ్‌లో సానుకూల పరిస్థితులు

కలిసొచ్చిన ధాన్యం దిగుబడులు

ఎకరానికి 35 నుంచి 40 బస్తాలు

1/3

2/3

3/3

Advertisement
 
Advertisement