అయ్యో భగవంతుడా.. మేం ఏ పాపం చేశాం.. ముగ్గురు కొడుకులు రోడ్డు ప్రమాదాల్లోనే..

Youth Deceased At Road Accident Karimnagar - Sakshi

సాక్షి,మల్యాల(చొప్పదండి): తల కొరివి పెట్టాల్సిన కొడుకులు కళ్లముందే ఒక్కొక్కరిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. అనారోగ్యంతో భార్య, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కొడుకులు మృతిచెందడంతో ఆ తండ్రి వేదనను ఓదార్చేందుకు మాటలు చాలడం లేదు. పేగు తెంచుకుని పుట్టిన పిల్లలు కళ్లముందే ప్రమాదంలో మృతిచెంది..ఆ తండ్రిని అనాథగా మిగిల్చిపోయారు. తప్పు ఎవరిదైనా వాహనదారుల అతివేగం..అజాగ్రత్త..నిర్లక్ష్యంతో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. జాతీయరహదారిపై వాహనదారుల అతివేగంతో రోడ్డెక్కాలంటే ద్విచక్ర వాçహనదారులు భయపడుతున్నారు. కోరుట్లలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్యాల మండలం రాజారం గ్రామానికి చెందిన యువకుడు మృతిచెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఒకే ఇంట్లోని ముగ్గురు అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలోనే మృతిచెందడంతో తండ్రి అనాథగా మిగిలిపోయారు.

మల్యాల మండలం రాజారం గ్రామానికి చెందిన బోదాసు రాజేశం–లక్ష్మికి ముగ్గురు కుమారులు. పెద్దకుమారుడు రాజశేఖర్‌ పదేళ్ల క్రితం రాజారం బస్‌స్టాప్‌ వద్ద ఆర్టీసీ బస్‌ ఢీకొని, బస్‌టైరు కిందపడి మృతిచెందాడు. రెండో కుమారుడు మధు మూడేళ్ల క్రితం ధరూర్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద సెప్టిక్‌ ట్యాంకు వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న చిన్నకుమారుడు రఘు రెండు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లి, శనివారం రాజారం తిరిగి వస్తుండగా కోరుట్లలోని జాతీయ రహదారిపై లారీ ఢీకొనడంతో మృతిచెందాడు. 

లారీ ఢీకొని చిన్న కుమారుడు
కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని ఫూల్‌వాగు బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్యాల మండలం రాజారం గ్రామానికి చెందిన బోదాసు రఘు(24) మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం ఉదయం మోటార్‌సైకిల్‌పై రఘు కోరుట్లలోని బంధువులను కలిసి ఇంటికి వెళుతుండగా ఫూల్‌వాగు బ్రిడ్జిపై లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో రఘు అక్కడిక్కడే మృతిచెందాడు. తండ్రి రాజేశం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీశ్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top