ప్రేమ పేరుతో మోసం.. యువకుడి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో మోసం.. యువకుడి ఆత్మహత్య

Published Mon, May 27 2024 10:46 AM

Young man suicide in hanamkonda

కాజీపేట: ప్రేమ పేరుతో యువతి మోసం చేసిందనే మనస్తాపంతో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ సమీపంలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. కాజీపేట మండలం సోమిడికి చెందిన మంతుర్తి రమేశ్, రాజమ్మ దంపతుల కుమారుడు రాజ్‌కుమార్‌ (28) దాదాపు ఏడేళ్లుగా హైదరాబాద్‌లో ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పనిచేసే చోట పరిచమైన ఓ యువతితో కొద్దికాలంగా చనువుగా ఉంటున్నాడు. సూర్యాపేట జిల్లాకు చెందిన సదరు యువతి కుటుంబీకులకు ఇటీవల వీరి ప్రేమ విషయం తెలియడంతో రాజ్‌కుమార్‌ను హెచ్చరించారు. 

దీంతో రాజ్‌కుమార్‌ ఎదురు తిరగడంతో యువతి బంధువులు సూర్యాపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రేమించిన యువతి.. కుటుంబీకుల ఒత్తిడికి తలొగ్గి ఎదురు తిరుగడం, బంధువులు చంపేస్తామంటూ బెది రించడంతో రాజ్‌కుమార్‌ మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఏడేళ్లుగా సాగిన ప్రేమాయణం.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ సెల్ఫీ వీడియోను రికార్డు చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బంధు, మిత్రులకు పంపించాడు. వెంటనే అప్రమత్తమైన సన్నిహితులు రాజ్‌కుమార్‌ను వెతకడానికి ప్రయత్నించగా సూర్యాపేటలో చిక్కాడు. 

ఎంత నచ్చ చెప్పినా వినకుండా తనకు ఆత్మహత్యే శరణ్యమని చెప్పి పరారయ్యాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం నల్లగొండ సమీపంలో గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన విషయం వెలుగు చూసింది. యువతి కుటుంబీకుల బెదిరింపుల వల్లే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, చెట్టంత ఎదిగిన కుమారుడు ప్రేమ కోసం బలయ్యాడని, తనను బెదిరించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు కోరారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement