8 ఏళ్ల నుంచి మృత్యువుతో పోరాడి ఓడిన యువకుడు.. ఏడాది వ్యవధిలో తల్లిదండ్రులు కూడా

Young Man Died Who Injured In Road Accident 8 Years Ago At Kodad - Sakshi

సాక్షి, నల్గొండ: స్నేహితుల సరదా పందెం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఏడాది వ్యవధిలో తల్లిదండ్రి మృతిచెందగా ఎనిమిదేళ్లుగా మృత్యువుతో పోరాడుతున్న కుమారుడు కూడా కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన బుధవారం కోదాడలో వెలుగులోకి వచ్చింది. కోదాడ పట్టణంలోని అనంతగిరి రోడ్డులో నివాసం ఉంటున్న కొండపల్లి శ్రీనాథ్, గౌతమి దంపతులకు కృష్ణకాంత్, శివ(29) సంతానం. శ్రీనాథ్‌ న్యాయవాదిగా, గౌతమి ప్రైవేట్‌ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ పిల్లలను పోషించుకుంటున్నారు.

కృష్ణకాంత్‌ ఉన్నత విద్య అభ్యసించి న్యాయవాద వృత్తిలో కొనసాగుతుండగా శివ డిగ్రీ అభ్యసిస్తున్నాడు. అప్పటి వరకు సాఫీగా సాగిపోతున్న వారి కుటుంబంలో అనుకోని అవాంతరం ఎదురైంది. ఎనిమిదేళ్ల క్రితం శివ స్నేహితులతో కలిసి కోదాడ పెద్ద చెరువు గుట్టపై పార్టీ చేసుకున్నారు. మద్యం అలవాటు లేని శివతో స్నేహితులు బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం చీకటి పడడంతో బైక్‌లపై అందరూ ఇళ్లకు బయలుదేరారు. 

సరదా పందెంతో ప్రమాదం బారిన పడి..
కాగా, స్నేహితులందరూ బైక్‌కు లైట్లు వేసుకోకుండా ఇళ్లకు ఎవరు ముందు వెళ్తే వారు పార్టీ ఇవ్వాలని పందెం పెట్టుకున్నారు. దీంతో మార్గమధ్యలో శివ బైక్‌ అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి కిందపడిపోయాడు. ప్రమాదంలో అతడి తలకు బలమైన గాయం కావడంతో పాటు నడుము కింది భాగం చచ్చుబడిపోయింది. 

ఏడాది వ్యవధిలో తల్లిదండ్రి మృతి
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివను కోదాడతో పాటు హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. కుమారుడి దీనస్థితి చూడలేక ఏడాది క్రితం తండ్రి శ్రీనాథ్‌ కన్నుమూయగా ఆరు నెలల క్రితం తల్లి కూడా మృతిచెందింది. సోదరుడి సంరక్షణలో చికిత్స పొందుతున్న శివ కూడా మృత్యువును జయించలేక మంగళవారం రాత్రి మృతిచెందాడు. తల్లిదండ్రులతో పాటు ఇప్పుడు సోదరుడు కూడా మృతిచెందడంతో ఆ ఇంట పెను విషాదం అలుముకుంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top