ప్రియుడి మోజులో పడి ఎంతపని చేసిందంటే..

Woman And Lover Arrested In Husband Assassination Case - Sakshi

భర్త హత్య కేసులో భార్యతో పాటు ప్రియుడి అరెస్ట్‌

కోవూరు(నెల్లూరు జిల్లా): వివాహేతర సంబంధంతో భర్తనే ఓ మహిళ హత్య చేసిందని నెల్లూరు రూరల్‌ డీఎస్పీ వై. హరినాథ్‌రెడ్డి తెలిపారు. స్థానిక సీఐ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కోవూరు కొత్తూరు దళితవాడకు చెందిన బండికాల రవీంద్ర ఈ నెల 7న ఏసీసీ కల్యాణ మండపం సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే తన భర్త మృతిపై అనుమానం ఉందని రవీంద్ర భార్య సమత కోవూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి సీఐ కె.రామకృష్ణారెడ్డి, ఎస్సై చింతం కృష్ణారెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 14 ఏళ్ల క్రితం కొత్తూరు దళితవాడకు చెందిన సమతకు కలువాయి మండలం పెరమనకొండ గ్రామానికి చెందిన బండికాల రవీంద్రతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయిన కొద్ది రోజుల తర్వాత కొత్తూరు దళితవాడలో కాపురం మార్చుకున్నారు.

రవీంద్ర అల్లూరు మండలంలో ఓ చర్చికి పాస్టరుగా పని చేస్తున్నారు. సమత కోవూరు శాంతినగర్‌–2 ప్రాంతానికి వలంటీరుగా పనిచేస్తోంది. ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి సమతకు సన్నిహితంగా ఉండే ఉపర్తి రాముకు ఫోన్‌ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. సమత, రాములు గదిలో ఉన్న విషయాన్ని రవీంద్ర చూడడంతో ఇద్దరూ రవీంద్ర ముఖానికి దిండు అడ్డం పెట్టి హత్య చేశారు. రాము తన ఆటోలో రవీంద్ర మృతదేహాన్ని తీసుకెళ్లి ఏసీసీ కల్యాణ మండపం సమీపంలో జాతీయ రహదారిపై పడేసి బొంతరాయితో ముఖంపై అతి కిరాతంగా కొట్టి రోడ్డుపై పడేశారు. మరుసటి ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.

అయితే తన భర్త ఒంటిపై గాయాలు ఉన్నాయని అతని మృతిపై అనుమానం ఉన్నట్లు సమత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేశారు. పోస్టుమార్టం నివేదికలో రవీంద్ర గాయాలతో మృతి చెందలేదని ఊపిరి ఆడకుండా చేయడం వల్ల మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో హత్యగా మార్పు చేసి దర్యాప్తు ప్రారంభించడంతో నిందితులైన సమత, రాములు సోమవారం తహసీల్దార్‌ సీహెచ్‌ సుబ్బయ్య ఎదుట లొంగిపోయారన్నారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరచినట్లు డీఎస్పీ వివరించారు. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన సీఐ కె.రామకృష్ణారెడ్డి, ఎస్సై చింతం కృష్ణారెడ్డి, ఏఎస్సై మూర్తి, పీసీలు చంద్ర, సైఫుల్లా, తాండ్ర వేణు, సాయిశృతి, హెడ్‌ కానిస్టేబుల్‌ అద్దంకి వెంకటేశ్వర్లు, కృష్ణ, మధు, శ్రీనివాసులను అభినందించి వారికి రివార్డుల కోసం ఎస్పీకి సిఫార్సు చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top