
ప్రతీకాత్మక చిత్రం
జఫర్‌గఢ్: ఆ దంపతులకు సంతానం లేదు.. ఒకరికొకరు తోడునీడగా బతికారు. భర్త మృతి చెందిన గంటల వ్యవధిలోనే నీ వెంటే నేను.. అంటూ భార్య తనువు చాలించింది. ఈ ఘటన జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రొడ్డ మంగయ్య (68), ఎల్లమ్మ (65) దంపతులకు సంతానం లేదు. బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం హన్మకొండకు వలస వెళ్లారు. లాక్‌డౌన్ సమయంలో ఉపాధి లేక తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు.
ఈ క్రమంలో కొద్ది రోజులుగా మంగయ్య అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. దీంతో మృతదేహం వద్ద భార్య కన్నీరు మున్నీరైంది. ‘చూసే వాళ్లు లేరు.. కన్నవాళ్లు లేరు.. నీవు లేకుండా నేను ఎలా బతకాలి’ అంటూ మంగళవారం తెల్లవారుజాము వరకు ఏడుస్తూ ఉన్న ఎల్లమ్మ.. భర్త శవం ఎదుటే తనువు చాలించింది. మృత్యువులోనూ కలిసే సాగిన వారి బంధాన్ని చూసిన గ్రామస్తులు కంటతడి పెట్టారు. మంగళవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు.