వాటర్‌ బాటిల్‌ గొడవ.. కదిలే రైలు నుంచి ప్యాసింజర్‌ను తోసేసిన సిబ్బంది

Water Bottle Row: Railway Passenger Throw Out By Pantry Staff - Sakshi

లక్నో: రైల్వే ప్యాంట్రీ సిబ్బంది దాష్టికానికి తెగపడ్డారు. కదిలే రైలు నుంచి ఓ వ్యక్తిని బయటకు తోసేశారు. వాటర్‌ బాటిల్‌ విషయంలో అతను వాళ్లతో వాగ్వాదానికి దిగగా.. పాన్‌ మసాలా రైలులో ఉమ్మేశాడంటూ సిబ్బంది అతనిపై దాడికి దిగారు. ఉత్తర ప్రదేశ్‌ లలిత్‌పూర్‌ దగ్గర శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. 

వాటర్‌ బాటిల్‌ విషయంలో చెలరేగిన గొడవ.. చిలికి చిలికి దుమారం రేపింది. ఆ కోపంలో సిబ్బంది.. సదరు ప్రయాణికుడిపై కక్ష కట్టారు. పాన్‌ మసాలా ఉమ్మేశాడంటూ గొడవ పెట్టుకుని.. చితకబాది బయటకు తోసేశారు.

రవి యాదవ్‌(26) అనే వ్యక్తి తన సోదరితో కలిసి రప్తిసాగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. జిరోలి దగ్గరకు చేరుకోగానే ప్యాంట్రీ స్టాఫ్‌తో అతనికి గొడవ మొదలైంది. వాటర్‌ బాటిల్‌ కొనుగోలు మొదలై.. రైలులో పాన్‌ మసాలా ఉమ్మేశారనే కారణంతో గొడవ పెద్దది అయ్యింది. ఈ తరుణంలో లలిత్‌పూర్‌ స్టేషన్‌ దగ్గర రవి యాదవ్‌ సోదరిని సిబ్బంది దించేశారు. అయితే అతన్ని మాత్రం దిగకుండా అడ్డుకున్నారు.

ఈలోపు రైలు కదిలింది. బలవంతంగా అతన్ని ఆపేసి.. రైలులోనే దాడి చేశారు. ఆపై అతన్ని పట్టాలపైకి విసిరేశారు. స్థానికులు రవిని గమనించి.. ఆస్పత్రికి తరలించారు. ప్రాణపాయ స్థితి నుంచి బయటపడినట్లు ఝాన్సీ పోలీసులు వెల్లడించారు. రవి ఫిర్యాదు మేరకు ప్యాంట్రీ సిబ్బందిపై కేసు నమోదు చేసుకుని.. ఒకరిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top