కన్సల్టెన్సీ.. కంత్రీ.. జాబులు పేరుతో ‘టీడీపీ’ నేత దగా

TDP Leader Fraud In The Name Of Consultancy In Ongole - Sakshi

ఒంగోలులో శ్రీనాథ్‌ జాబ్‌ కన్సల్టెన్సీ పేరుతో నిరుద్యోగులకు టోపీ 

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం 

దాదాపు 20 మంది నుంచి రూ.కోటికి పైగా వసూలు 

కార్యాలయం మూసివేయడంతో పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు 

కన్సల్టెన్సీ నిర్వాహకుడు జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి దాసరి వెంకటేశ్వర్లు  

సాక్షి ప్రతినిధి, ఒంగోలు(ప్రకాశం జిల్లా): జిల్లాలో టీడీపీ కంత్రీగాళ్లు చెలరేగిపోతున్నారు. పార్టీ నేతల ముసుగులో చీకటి వ్యాపారాలు, మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిషేధిత గుట్కాలు.. గంజాయి విక్రయిస్తూ ఓ టీడీపీ నేత కుమారుడు పోలీసులకు చిక్కగా,  ఓ మహిళా నేత భర్త ఎస్సీ కార్పొరేషన్‌లో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తూ లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన సొమ్మును స్వాహా చేసి జైలు పాలయ్యాడు. తాజాగా ఆ పార్టీ జిల్లా కార్యాలయ కార్యదర్శి దాసరి వెంకటేశ్వర్లు నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తానంటూ కన్సల్టెన్సీ పేరుతో రూ.కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. ఇతని బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
చదవండి: ఆ టీడీపీ నేత సిగ్గు లేకుండా రూ.20 కోట్లు అడిగాడు: ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు

విశాఖలో నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తామంటూ రూ.కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ‘స్మార్ట్‌ సిటీ జాబ్‌ కన్సల్టెన్సీ’ తరహాలోనే ఒంగోలులో శ్రీనాథ్‌ జాబ్‌ కన్సల్టెన్సీ అండ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టింది. సాక్షాత్తూ టీడీపీ నాయకుడు ఈ సంస్థను ఏర్పాటు చేసి నిరుద్యోగులను నిలువునా మోసం చేసి దోచుకున్నాడు. ఉద్యోగాల కోసం కాళ్లరిగేలా తిరిగిన నిరుద్యోగులు చివరకు ఉద్యోగాలు రావని నిర్ధారించుకొని డబ్బులైనా తిరిగి ఇవ్వాలని ప్రాధేయపడినా ప్రయోజనం లేదు. డబ్బులు ఇచ్చేది లేదు మీకు దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరింపులకు దిగటంతో బాధితులు న్యాయం చేయాలని జిల్లా పోలీస్‌ అధికారులను వేడుకుంటున్నారు. 

మోసం ఇలా..
స్థానిక పాత గుంటూరు రోడ్డులోని టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శిగా పనిచేస్తున్న దాసరి వెంకటేశ్వర్లు ఎదురుగా ఉన్న సూర్య కాంప్లెక్స్‌లో గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని 110 రూమ్‌ని అద్దెకు తీసుకొని శ్రీనాథ్‌ జాబ్‌ కన్సల్టెన్సీ అండ్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ పేరిట రిజిస్టర్‌ నంబర్‌ 52/2020తో కార్యాలయాన్ని ప్రారంభించాడు. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేశాడు. ఒక్కో ఉద్యోగానికి రూ.3 లక్షల చొప్పున ఖర్చవుతుందని నమ్మబలికాడు. దీంతో దాదాపు 15 నుంచి 20 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో డబ్బులు చెల్లించారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జ నార్దన్‌తో దాసరి వెంకటేశ్వర్లు (ఫైల్‌) 

మద్దిపాడు గ్రామానికి చెందిన చల్లపల్లి సుధాకర్‌బాబు జూన్‌ 2020లో ఉద్యోగం కోసం శ్రీనాథ్‌ కన్సల్టెన్సీ కార్యాలయానికి వెళ్లాడు. ఒక్కో ఉద్యోగానికి రూ.5 లక్షలు అవుతుందని వెంకటేశ్వర్లు చెప్పాడు. సుధాకరబాబు అంత ఇచ్చుకోలేనని మద్దిపాడులో కంప్యూటర్‌ సెంటర్‌ను నిర్వహిస్తూ తను, తన భార్య జీవనం సాగిస్తున్నామని చెప్పాడు. దీంతో ఇద్దరికీ కలిపి రెండు ఉద్యోగాలకు రూ.3 లక్షల చొప్పున మొత్తం రూ.6 లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు.

2020 జూన్‌లో రెండు సార్లు రూ.2 లక్షల చొప్పున రూ.4 లక్షలు, 2021లో మరో రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.6 లక్షలు వెంకటేశ్వర్లుకి చెల్లించారు. ఆ తరువాత ఎన్ని రోజులు తిరుగుతున్నా ఉద్యోగాలు ఇవ్వలేదు. చివరకు ఇచ్చిన డబ్బులైనా ఇవ్వాలని ప్రాధేయపడినా లాభం లేదు. ఆ తర్వాత కార్యాలయాన్ని మూసేశారు. ఈ విధంగా ఎంతో మంది బాధితులు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక లబోదిబోమంటూ గుండెలు బాదుకొని ఒక్కొక్కరిగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శిగా దాసరి:
దాసరి వెంకటేశ్వర్లు టీడీపీ సీనియర్‌ నాయకుడు. మర్రిపూడి మండలం అయ్యపురాజుపాలేనికి చెందిన వెంకటేశ్వర్లు టీడీపీ తరఫున మర్రిపూడి ఎంపీపీగా కూడా గెలిచాడు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌కు అత్యంత సన్నిహితుడు కూడా. ఆ తరువాత దాసరి వెంకటేశ్వర్లును ఒంగోలులోని ఎన్‌టీఆర్‌ భవన్‌లో నిర్వహిస్తున్న ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు కూడా ఆయన నిర్వహించేవాడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఖాదీబోర్డు మెంబరుగా కూడా పనిచేశాడు.

టీడీపీ నేతల చీకటి భాగోతాలు..
టీడీపీ నాయకులు నిత్యం ఎదుటి వారి తప్పులను వల్లెవేస్తుంటారు. కానీ పార్టీలో కొంతమంది చేసే నీతిమాలిన.. రోత మాలిన పనులను మాత్రం తమకేమీ తెలియదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఒంగోలు నగరానికి చెందిన 33వ డివిజన్‌ టీడీపీ నేత జగన్నాథం శారద భర్త మురళీమోహన్‌ ఎస్సీ కార్పొరేషన్‌లో  ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేషన్‌లో చక్రం తిప్పాడు. లబ్ధిదారుల నుంచి రికవరీ చేసిన సొమ్మును కార్పొరేషన్‌కు చెల్లించకుండా స్వాహా చేశాడు. బాధితులు కార్పొరేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అతని భాగోతం వెలుగు చూసింది. విచారణలో అక్రమాలు రుజువు కావడంతో మురళీ మోహన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. 46వ డివిజన్‌కు చెందిన టీడీపీ నేత మస్తానమ్మ కుమారుడు నిషేధిత గుట్కాలు, గంజాయి విక్రయిస్తూ పోలీసులకు చిక్కాడు. తాజాగా పార్టీ సీనియర్‌ నాయకుడు దాసరి వెంకటేశ్వర్లు నిరుద్యోగుల నుంచి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసి నిలువునా ముంచేశాడు.

చంపుతానని బెదిరించాడు
ప్రభుత్వ విభాగాల్లో ఔట్‌సోర్సింగ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి జిల్లా టీడీపీ కార్యాలయంలో మేనేజర్‌గా పనిచేస్తున్న దాసరి వెంకటేశ్వర్లు మోసం చేశాడు. మూడు విడతలుగా నాకు, నా భార్యకు ఉద్యోగాలు కావాలని రూ.6 లక్షలు చెల్లించాను. మద్దిపాడు కంప్యూటర్‌ సెంటర్‌ నడుపుకుంటూ పైసా...పైసా కూడబెట్టుకొని ఉన్నది మొత్తం అతనికి ధారపోశాను. ఉద్యోగం ఇవ్వకపోగా చివరకు డబ్బులు అడిగినా ఇవ్వలేదు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరిస్తున్నాడు. ఇక చేసేది లేక ప్రాణ భయంతో జిల్లా ఎస్పీ మలికా గర్గ్‌కు ఫిర్యాదు చేశాను. నాకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నాను.
– చల్లపల్లి సుధాకర బాబు, మద్దిపాడు, బాధితుడు   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top