లగేజ్‌ బ్యాగేజ్‌లలో గంజాయి ప్యాకెట్లు..నలుగురు అరెస్టు

Rachakonda Police Arrested Cannabis In Travel Bags At AC Coach - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ట్రావెల్‌ బ్యాగ్‌లలో గంజాయి ప్యాకెట్లు పెట్టుకొని, ఏసీ కోచ్‌లో హైదరాబాద్‌ మీదుగా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు నుంచి ఢిల్లీకి వెళుతున్న నలుగురు వ్యక్తులను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 52 కిలోల గంజాయి, లీటర్‌ హష్‌ ఆయిల్, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాచకొండ సీపీ  మహేశ్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. 

  • రాజస్థాన్‌కు చెందిన విజయ్‌ ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ట్రావెల్‌ బ్యాగ్‌లలో సర్ది కిరాయి ఏజెంట్ల ద్వారా ఢిల్లీకి రైలులో అక్రమంగా రవాణా చేసేవాడు. ఈ దందాలో అతడికి ఢిల్లీకి చెంది న గంజాయి పెడ్లర్‌ ఇమ్రాన్‌తో పరిచయం ఏర్పడింది. 
  • ఈ క్రమంలో ఇమ్రాన్‌ నుంచి ఆర్డర్‌ అందుకున్న విజయ్‌.. 52 కిలోల గంజాయి, 25 బాటిళ్ల హష్‌ ఆయిల్‌ (ఒక్కోటి 40 మిల్లీ గ్రాములు) చొప్పున చిన్న ప్యాకెట్లుగా మార్చి వాటిని ట్రావెల్‌ బ్యాగ్‌లలో సర్ది, ఇమ్రాన్‌కు సమాచారం అందించాడు. దీంతో సరుకు తీసుకొచ్చేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌  ముహిద్దీన్‌పూర్‌కు చెందిన ఫయ్యూ మ్, జునైద్, సరిఖ్, మొహమ్మద్‌ నజీమ్‌ అనే కిరాయి ఏజెంట్లను ఇమ్రాన్‌ సంప్రదించాడు. 
  • ఈ నెల 3న ఢిల్లీలో రైలెక్కిన వీరు 5న వైజాగ్‌లో దిగి స్థానిక లాడ్జిలో బస చేశారు. విజయ్‌ నుంచి సరుకు తీసుకొని అదే రోజు రాత్రి దువ్వాడ రైల్వే స్టేషన్‌లో గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. ఉదయం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పోలీసుల తనిఖీలు జరుగుతున్నట్లు తెలియడంతో  మౌలాలీ రైల్వే స్టేషన్‌లో దిగారు. రాత్రి వరకూ స్టేషన్‌ ఆవరణలో గడిపారు. రాత్రి 11 గంటల తర్వాత సికింద్రాబాద్‌ నుంచి ఢిల్లీకి దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌లో థర్డ్‌ ఏసీలో తత్కాల్‌ టికెట్లు బుక్‌ చేసుకున్నారు. రైలు ఎక్కేందుకు మౌలాలీ నుంచి బస్‌లో సికింద్రాబాద్‌ వెళుతుండగా సమాచారం అందుకున్న ఎల్బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు జెడ్‌టీఎస్‌ క్రాస్‌రోడ్స్‌లో వారిని అదుపులోకి తీసుకున్నారు.   

నిరంతర నిఘాతో అడ్డుకట్ట : సీపీ 
రాష్ట్రంలో డ్రగ్స్‌పై నిఘా పెరగడంతో సరఫరా తగ్గింది. ఎక్కడికక్కడ చెక్‌పోస్ట్‌లు, అరెస్ట్‌లు చేస్తుండటంతో సరఫరాదారుల్లో వణుకు పుట్టింది. గంజాయి సరఫరా తగ్గడంతో రేట్లు పెరిగాయని సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు.   

(చదవండి: ఫంక్షన్‌.. ఉండదిక టెన్షన్‌)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top