‘సరిహద్దు’లో దగా..!: నిషేధిత పురుగు మందులు

Prohibited Pesticides Supply In Nalgonda District - Sakshi

సాక్షి, చిలుకూరు (కోదాడ): అమాయక రైతులను అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు దళారులు నిషేధిత పురుగు మందులను అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆ మందుల వాడకంతో స్వల్పకాలంలో ప్రయోజనాలు కనిపిస్తుండగా దీర్ఘకాలంలో వాటితో ఎన్నో దుష్పరిణామాలు ఉంటాయని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ పురుగుల మందులను గుంటూరు జిల్లా నుంచి దిగుమతి చేసుకుంటున్న దళారులు రాష్ట్ర సరిహద్దు (సూర్యాపేట , నల్లగొండ జిల్లాలు) మండలాల్లోని రైతులకు తక్కువ ధరకేనంటూ విక్రయిస్తూ దగా చేస్తున్నారు. అనుమతులు లేని విషతుల్యమైన రసాయన మందుల విక్రయాలు యథేచ్ఛగా జరుగతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. 

నీటి విడుదలతో..
నాగార్జునసాగర్‌ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో పాటు ఎగువనుంచి వరద వస్తుండడంతో ఎడమకాల్వకు సకాలంలో నీటిని విడుదల చేశారు. దీంతో ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలోని దామరచర్ల, గరిడేపల్లి, నేరేడుచర్ల, హుజూర్‌నగర్, మఠంపల్లి, చిలుకూరు, కోదాడ తదితర మండలాల్లో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో వరి పంటను ఎక్కువగా సాగు చేశారు. నెల రోజులు దాటిన వరిపొలాలకు ప్రస్తుతం దోమపోటు, తెగుళ్లు ఆశించాయి. అయితే ధర తక్కువగా ఉండడంతో రైతులు తమ పొలాలను కాపాడుకునేందుకు గుంటూరు జిల్లా మందుల వాడకంపై మొగ్గు చూపుతున్నారు. 

ధర తక్కువంటూ..
ఈ ప్రాంతంలో లభించే రసాయనిక మందులు దాదాపుగా మల్టీనేషన్‌ కంపెనీలకు చెంది ప్రభుత్వ ఆమోద ముద్రతో విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో వీటి ధర కూడా ఎక్కువే. ఇదే అదునుగా చేసుకున్న దళారులు ఆంధ్రా ప్రాంతంలో నిషేధించిన గుంటూరు మందులు తక్కువ ధరేనంటూ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మందులు గుంటూరు జిల్లా కేంద్రం సత్తెనపల్లి రోడ్డులోని ఓ మిర్చి యార్డు దగ్గరలోని గోదాము నుంచి సరఫరా అవుతున్నాయని తెలిసింది. కాగా, ఈ మందులు ( లాకర్, బీపీహెచ్‌ పురుగు, దోమలకు , మూవ్‌ తెగుళ్లకు సంబంధించినవి) పిచికారీ చేసిన వెంటనే పురుగులు చనిపోతుండడం, ధర తక్కువ (ఎకరానికి 100 గ్రాముల ప్యాకెట్‌ రూ.1000)కు లభిస్తుండడంతో రైతులు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇదే ప్రాంతంలో లభించే మందులకు రెట్టింపు ధర ఉండడంతో రైతులు వాటిని కొనుగోలు చేయడం లేదు. ఫలితంగా ఇటు రాష్ట్ర ఆదాయానికి కూడా గండిపడుతోంది. 

గ్రామానికి ఇద్దరు చొప్పున ఏజెంట్లు
రాష్ట్ర సరిహద్దు మండలాల్లోని ప్రతి గ్రామంలో ఇద్దరు చొప్పున ఏజెంట్లు ఆయా కంపెనీల నిర్వాహకులు నియమించుకుని మందుల విక్రయాలు జరుపుతున్నారని తెలిసింది. అయితే ఈ ఏజెంట్లు రైతుల వద్ద ముందస్తుగానే డబ్బులు తీసుకుని రాత్రి వేళల్లో ఆర్డర్‌ మీద సరఫరా చేస్తున్నారని సమాచారం. ఏజెంట్లకు కమీషన్‌ ఎక్కువగా వస్తుండడంతో స్థానిక రైతులకు మాయమాటలు చెప్పి అంటగడుతున్నారని ప్రచారం జరుగుతోంది. 

నష్టాలు ఎక్కువే... 
గుంటూరు మందులు పిచికారీ చేసిన వెంటనే పురుగులు చనిపోతున్నాయి. కానీ దీర్షకాలికంగా ఎన్నో నష్టాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నిషేధిత మందులలో సైనైడ్‌ కలుపుతారని, వీటిని పిచికారీ చేస్తే కొద్ది రోజులకు చేలు ఎర్రబారతాయని, తదనంతరం సారవంతమైన భూములు చౌడు భూములుగా మారుతాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు. ఈ మందులతో నీరు విషతుల్యంగా మారడంతో మానవాళికి కూడా ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.  

మా దృష్టికి కూడా వచ్చింది 
గుంటూరు జిల్లా మందుల వ్యవహారం మా దృష్టికి కూడా వచ్చింది. అ మందులు పిచికారీ చేయకూడదని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.  కొంత మంది రైతులు దళారుల ద్వారా రహస్యంగా తెచ్చుకుంటున్నారు. ఈ మందులపై నిఘా ఏర్పాటు చేశాం. ఈ మందుల తయారీలో సైనైడ్‌ కలుపుతారు. ఎంతో ప్రమాదకరం. ఎవరైనా ఆ మందులు విక్రయిస్తే మాకు సమాచారం ఇవ్వాలి. –జ్యోతిర్మయి, జిల్లా వ్యవసాయాధికారిణి 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top