పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమ జంట బలవన్మరణం

Parents Reject Relationship Couple Commits Suicide - Sakshi

క్వారీ గుంతలో దూకి బలవన్మరణం

కులాలు వేరని పెద్దలు అంగీకరించకపోవడమే కారణం 

ఇరు కుటుంబాలపై స్థానికుల ఆగ్రహం 

జగద్గిరిగుట్ట: ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. పెద్దలకు చెప్పారు.. కులాలు వేరు కావడంతో వాళ్లు ససేమిరా అన్నారు. ఇంతలో ప్రేమికుడికి ఇంట్లో పెళ్లి చూపులు చూడటం మొదలుపెట్టారు. దీంతో ఇద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుని.. క్వారీ గుంతలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఎన్టీఆర్‌ నగర్‌ ఎల్లమ్మ బండ ప్రాంతానికి చెందిన సురేష్, విజయలక్ష్మి దంపతుల రెండవ కుమార్తె(16) కేపీహెచ్‌బీలోని ఎన్‌ ఆర్‌ఐ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవ త్సరం చదువుతోంది. వీరి ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉండే కృష్ణ, అండాలు దంపతుల కుమారుడు విశాల్‌(21) అలియాస్‌ సురేష్‌.. బాలిక కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

విశాల్‌ మొదటి సంతానం కాగా, మరో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. విశాల్‌ రెండేళ్ల క్రితం ఓ ప్రింట్‌ప్రెస్‌లో పనిచేసి మానేశాడు. వీరి ప్రేమ విషయంలో ఇరు కుటుంబాల మధ్య 2 సార్లు గొడవలయ్యాయి. ఇద్దరు కులాలు వేరు కావడంతో అమ్మాయి తరుఫు వారు అభ్యంతరం చెప్పారు. అలాగే ఇటీవల జనగాం ప్రాంతంలో విశాల్‌కు సంబంధం చూసి.. ఆ అమ్మాయితో పెళ్లి చేయాలనే నిర్ణయానికి అతని తల్లిదండ్రులు వచ్చారు. విశాల్‌ మాత్రం తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని తేల్చిచెప్పాడు. అందుకు అతడి తల్లిదం డ్రులు ససేమిరా అనడంతో.. ఈ నెల 14 తెల్లవారు జామున 4 గంటలకు ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపో యారు. అదేరోజు జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు మిస్సింగ్‌ అయినట్లు కేసు నమోదు అయింది. 

పోలీసులు వెతుకుతుండగానే.. 
వీరి ఆచూకీ కోసం గాలిస్తుండగానే బాలయ్యనగర్‌ క్వారీ గుంతలో దూకి ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. పారిపోయిన ఇద్దరు మృతిచెందినట్లు గుర్తించిన పోలీసులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. మృతదేహాలను బయటకు తీసిన తర్వాత అమ్మాయి మెడలో పసుపు తాడు గుర్తించారు. ఏదైనా దేవాలయంలో పెళ్లి చేసుకున్న తర్వాతే.. పెద్దలు ఒప్పుకోరన్న కారణంతో ఇద్దరు క్వారీ గుంతలో పడి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. పక్కపక్క ఇళ్లలోనే ఉంటున్న వీరు రెండేళ్లుగా ప్రేమించుకున్నట్లు స్థానికులు తెలిపారు. కులాల పంతాలకు పోయి తల్లిదండ్రులే ఇద్దరి మృతికి కారకులయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదులు 
తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top