ఖరీదైన చీరలపై మోజు | Sakshi
Sakshi News home page

ఖరీదైన చీరలపై మోజు

Published Tue, May 3 2022 8:15 AM

Mothers And Daughter Commit Theft Hope Buying Expensive Sarees - Sakshi

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లోని  చీరల షోరూంలలో సరికొత్త డిజైన్ల చీరలు కట్టుకోవాలని ఆమెకు ఆశ. అయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో కనువిందు చేసే వాటిని కట్టుకోవడం కష్టతరంగా మారింది. తన ఇష్టాన్ని ఎలాగైనా తీర్చుకోవాలన్న కోరిక ఓ యువతిని దొంగగా మార్చింది. తల్లితో కలిసి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లోని ఖరీదైన షోరూంలకు వెళ్తూ సేల్స్‌మెన్స్‌ కళ్లుగప్పి తాము ఇష్టపడ్డ చీరలను దొంగిలిస్తున్న తల్లీ, కూతుళ్లను జూబ్లీహిల్స్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

వివరాల్లోకి వెళ్తే... అంబర్‌పేట సలీంనగర్‌ కాలనీకి చెందిన నల్లూరి సుజాత, ఆమె కుమార్తె నల్లూరి వెంకటలక్ష్మి పావనికి చీరలంటే మోజు. ఈ నేపథ్యంలో ఈ నెల 21న జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 45లోని తలాశా క్లాత్‌ షోరూంకు వచ్చింది. అందులో తాను ఇష్టపడ్డ రూ. 1.10 లక్షల విలువ చేసే అయిదు చీరలను, అదే రోజు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 10లోని గోల్డెన్‌ థ్రెడ్స్‌ క్లాత్‌ స్టోర్‌లో రూ. 2.80 లక్షల విలువ చేసే నాలుగు చీరలను దొంగిలించి పరారయ్యారు.

షాపు యజమానురాలు కవిత ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ క్రైం సీఐ రమేష్, డీఎస్‌ఐ లక్ష్మీనారాయణ దర్యాప్తు చేపట్టారు. దొంగతనం చేసిన తర్వాత తల్లీకూతుళ్లు ఇద్దరు జూబ్లీహిల్స్‌ మెట్రో స్టేషన్‌లో రైలెక్కి ముసరంబాగ్‌ స్టేషన్‌లో దిగారు. ఆయా ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలు స్పష్టంగా ఉండటంతో వీరు స్వైప్‌ చేసిన మెట్రో కార్డ్‌ ఆధారంగా వారి అడ్రస్‌ గుర్తించారు. సోమవారం నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ. 3.90 లక్షల విలువైన తొమ్మిది చీరలను స్వాధీనం చేసుకున్నారు.  

(చదవండి: ఐపీఎల్‌ బెట్టింగ్‌ ముఠాల గుట్టు రట్టు)

Advertisement
 
Advertisement
 
Advertisement