
బెంగళూరు: ఒంటరిగా మహిళలు, బాలికలు కనపడితే చాలు ఆకతాయిలు రెచ్చిపోతుంటారు. అలా ప్రవర్తించిన ఓ ఆకతాయికి నడిరోడ్డుపై చితకబాది బుద్ధి చెప్పారు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. హసన్ జిల్లాలోని మహారాజా పార్క్ వద్ద బాలికతో అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణతో రద్దీగా ఉండే ట్రాఫిక్ జంక్షన్‌లో ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి, బట్టలూడదీసి ఊరేగించారు.
దాడికి గురైన వ్యక్తి విజయపుర జిల్లాకు చెందిన మేఘరాజ్‌గా గుర్తించారు. హసన్ నగరంలో భవన నిర్మాణ కార్మికుడు.మేఘరాజ్ పార్క్‌కి అప్పుడప్పుడు వచ్చి సేదతీరుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓ బాలిక ఒంటరిగా ఉండడాన్ని గమనించిన మేఘారాజ్ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. ఇది గమనించిన స్థానికులు కొందరు అతనిపై దాడి చేశారు. అయితే పోలీసులకు అప్పగించడానికి బదులు, వారు అతనిని కొట్టి, బట్టలు విప్పి, ఆపై రద్దీగా ఉండే ట్రాఫిక్ జంక్షన్ అయిన హేమావతి విగ్రహం సర్కిల్ దగ్గర ఒంటిపై బట్టలు లేకుండా ఊరేగించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. వెంటనే మేఘరాజ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై ఆరా తీసిన హసన్ నగర పోలీసులు నలుగురు గుర్తు తెలియని వ్యక్తులపై..దాడి చేసి ఊరేగించినందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా బాలిక మాత్రం మేఘరాజ్‌పై ఎటువంటి ఫిర్యాదు చేయలేదని సమాచారం.