గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌

Maharashtra: Maoist Killed In Police Encounter In Gadchiroli  - Sakshi

26 మంది మావోయిస్టులు మృతి

నలుగురు పోలీస్‌ కమాండోలకు గాయాలు

10 గంటలపాటు సాగిన ఎదురు కాల్పులు 

నేడు ఎన్‌కౌంటర్‌ ఘటనపై మరింత స్పష్టత  

సాక్షిప్రతినిధి, వరంగల్‌/మంచిర్యాల/చర్ల: మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. శనివారం మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దు గడ్చిరోలి జిల్లా ధనోరా తాలుకా గ్యారబట్టి అడవుల్లో తుపాకులు గర్జించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు  జరిగిన ఎదురు కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతిచెందారు.

పోలీస్‌ కమాండోలు నలుగురు గాయపడ్డారు.మృతి చెందిన మావోయిస్టుల్లో కీలక నేత మిలింద్‌ తేల్‌తుమ్డే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతుండగా ఆదివారం ఉదయం వరకు మృతుల పూర్తి వివరాలు తెలుస్తాయని గడ్చిరోలి ఎస్పీ అంకిత్‌ గోయల్‌ పేర్కొన్నారు. గాయపడిన పోలీసులను చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌లో నాగ్‌పూర్‌కు తరలించారు.  
 
సుదీర్ఘ పోరు
గడ్చిరోలి డివిజనల్‌ కమిటీ సభ్యుడి నేతృత్వంలో కోర్చి దళం సంచరిస్తోందని పక్కా సమాచారం రావడంతో అడిషనల్‌ ఎస్‌పీ సౌమ్య ముండే నేతృత్వంలో సి–60 కమాండోల బృందం కూంబింగ్‌ ప్రారంభించింది. వంద మందికి పైగా బలగాలు ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ధనోరా గ్యారబట్టి అటవీ ప్రాంతంలోని కోర్చి గ్రామ సమీపంలో తారసపడిన మావోయిస్టులు కమాండో బృందంపైకి కాల్పులకు తెగబడ్డారు. వెంటనే బలగాలు దీటుగా బదులిచ్చాయి.

ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అడవులు కాల్పుల మోతతో దద్దరిల్లాయి. ఘటనలో నలుగురు కమాండోలు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలం నుంచి రాత్రి 7 గంటల వరకు 26 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పీ అంకిత్‌ గోయెల్‌ తెలిపారు. ఘటనాస్థలి నుంచి 18 ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులైన పోలీసులను చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌లో నాగ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు.

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి
మావోయిస్టు కేంద్ర కమిటీ సాంకేతిక విభాగంలో పని చేస్తున్న రవి అలియాస్‌ జైలాల్‌ చనిపోయినట్లు భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. గతేడాది జూన్‌ 25న బాణం బాంబులు పరీక్షిస్తున్న సమయంలో తీవ్రంగా గాయపడినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. సాంకేతికతలో దిట్ట అయిన రవి మరణవార్తను చాలా ఆలస్యంగా పార్టీ బహిర్గతం చేసింది.  

మృతుల్లో మిలింద్‌ తేల్‌తుమ్డే?

ఎన్‌కౌంటర్‌ మృతుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్‌ తేల్‌తుమ్డే అలియాస్‌ దీపక్, అలియాస్‌ ప్రవీణ్‌ కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతుల్లో పలువురు డివిజన్, ఏరియా కమిటీ కార్యదర్శులు, సభ్యులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మృతుల వివరాలపై ఆదివారం వరకు స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఎల్గార్‌ పరిషత్‌–భీమా కోరెగావ్‌ కేసులో నిందితుడిగా ఉన్న మిలింద్‌ పుణె పోలీసుల మోస్ట్‌ వాటెండ్‌ జాబితాలో ఉన్నాడు. ‘మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బతగిలింది. ఇది పోలీసు బలగాలకు లభించిన ఘన విజయం’అని ఎస్‌పీ గోయెల్‌ పేర్కొన్నారు. మిలింద్‌కు గన్‌మెన్‌గా పని చేసిన రాకేశ్‌ కొద్ది రోజుల క్రితమే పోలీసులకు లొంగిపోవడం గమనార్హం.   

దెబ్బ మీద దెబ్బ...
నిత్యం డ్రోన్‌లతో జల్లెడ పడుతూ, దండకారణ్యంలో కూంబింగ్‌లతో సాగుతున్న ఆపరేషన్‌ ప్రహార్‌తో ఏడాది కాలంగా మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. 2018లో ఏప్రిల్‌ 23న గడ్చిరోలి జిల్లా అహెరి, ఏటపల్లి తాలూకాల్లో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో 40మంది మావోయిస్టులు మృత్యవాత పడ్డారు.  

ఈ ఏడాదిలో భారీ ఎన్‌కౌంటర్లు  
మే 21న పయిడి, కోట్మి అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13మంది మావోయిస్టులు చనిపోయారు. అక్టోబర్‌ 11న కోస్మి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top