వివాహేతర సంబంధం..భార్య, అత్త, ప్రియుడు, మరో మిత్రుడితో కలిసి..

Jadcherla: Woman Kills Husband With Lover For Opposing extramarital Affair - Sakshi

సాక్షి, జడ్చర్ల (మహబూబ్‌నగర్‌): వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను భార్య, అత్తతో పాటు ప్రియుడు, మరో స్నేహితుడు కలిసి తుదముట్టించారు. ఓ సినిమాను చూసి అందులో జరిగిన విధంగా పథకం పన్నారు. ఈ కేసును ఎనిమిది రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. శుక్రవారం జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు వివరాలను డీఎస్పీ కిషన్‌ వెల్లడించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం బూర్గుపల్లిలోని శ్రీశైలం (29)కు అదే గ్రామానికి చెందిన గీతతో 2013 డిసెంబర్‌లో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

భర్త కారు డ్రైవర్‌గా, కూలీగా పనిచేసేవాడు. ఆరేళ్లక్రితం బతుకుదెరువు కోసం భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్‌ వెళ్లి రత్నానగర్‌లో కిరాయి ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆ ఇంటి ఎదురుగా ఉండే విక్రంతో పరిచయం ఏర్పడింది. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవటంతో అతని వద్ద గీత రూ.50వేలు అప్పుగా తీసుకుంది. ఈ క్రమంలోనే వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న భర్త వారిద్దరినీ మందలించినా ఎలాంటి మార్పు రాలేదు.  


కేసు వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ కిషన్‌ 

దృశ్యం సినిమా చూసి.. 
అతని అడ్డు తొలగించుకునేందుకు గీత, ఆమె తల్లి వెంకటమ్మ, ప్రియుడు విక్రం దృశ్యం సినిమా చూసి అందులో ఉన్నట్టుగానే పథకం పన్నారు. విక్రం స్నేహితుడు రాజును శ్రీశైలంతో చనువుగా ఉండాలని పురమాయించారు. ఈ క్రమంలోనే గత నెల 31న శ్రీశైలం బూర్గుపల్లికి వచ్చాడు. అప్పటికే విక్రం ప్రత్యేక రాడ్‌ తయారు చేసుకున్నాడు. ఒక్కో వస్తువును ఒక్కోచోట కొనుగోలు చేసి ఏమాత్రం అనుమానం రాకుండా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. సనత్‌నగర్‌లో దుస్తులు, రోడ్డుపై హెల్మెట్‌ కొన్నారు. నంబర్‌ ప్లేట్‌ సరిగ్గాలేని బైక్‌ను తీసుకుని రాజుతో కలసి జడ్చర్లలో మద్యం కొనుగోలు చేశారు.

ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు విక్రం, రాజు తమ సెల్‌ఫోన్లను హైదరాబాద్‌లోనే ఉంచి తరచూ ఇతరులతో ఆ ఫోన్లకు కాల్‌ చేసి వారిద్దరు అక్కడే ఉన్నట్టుగా నమ్మబలికారు. కిష్టంపల్లికి చేరుకుని అక్కడ ఎవరూ గుర్తు పట్టకుండా హెల్మెట్, మాస్క్‌లు ధరించి ఓ దుకాణంలో వాటర్‌బాటిల్‌ కొని వారి వద్ద తన ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అయిందని అత్యవసరంగా ఫోన్‌ చేసుకోవాలని దుకాణం మహిళ వద్ద తీసుకుని శ్రీశైలంకు రాజు ఫోన్‌ చేసి మాట్లాడాడు. ఆటో కొనేందుకు వచ్చానని వెంటనే హనుమాన్‌ దేవాలయం వద్దకు రావాలని కోరాడు. అక్కడికి వచ్చిన అతడిని బైక్‌పై ఎక్కించుకుని సమీపంలోని పొలంలోకి వెళ్లి అదేరోజు అర్ధరాత్రి మద్యం తాగారు.
చదవండి: దృశ్యం’ సినిమా చూసి.. భార్య, అత్త, ప్రియుడితో కలిసి కుట్ర


నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, ఇనుపరాడ్‌  

అంతలోనే విక్రం వెనుక నుంచి వచ్చి ఇనుపరాడ్‌తో శ్రీశైలం తలపై కొట్టగా, కళ్లల్లో రాజు కారం కొట్టి చంపేసి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. మరుసటి రోజు చుట్టుపక్కలవారు గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. అక్కడ లభించిన ఆధారాలను బట్టి ఎట్టకేలకు నలుగురు నిందితులను శుక్రవారం ఉదయం గొల్లపల్లి సమీపంలో అరెస్ట్‌ చేసి అనంతరం కోర్టులో హాజరు పరిచారు. నిందితుల నుంచి ఐదు సెల్‌ఫోన్లు, ఇనుపరాడ్‌ స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో సీఐలు రమేష్‌బాబు, జములప్ప, ఎస్‌ఐలు రాజేందర్, జయప్రకాష్‌ పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top