స్టేటస్‌ పెట్టి.. బావిలో దూకాడు

Inter Student Suicide By Jumped Into Well In Yadadri Bhuvanagiri - Sakshi

మ్యాథ్స్‌ లెక్చరర్, తోటి విద్యార్థిని కారణమని స్టేటస్‌లో ఆరోపణలు 

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన 

భూదాన్‌పోచంపల్లి: వ్యవసాయబావిలో దూకి ఇంటర్‌ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దగూడెంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దగూడేనికి చెందిన నోముల ఆకాశ్‌రెడ్డి(17) భూదాన్‌పోచంపల్లిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ సెకండియర్‌ చదువుతున్నాడు. మ్యాథ్స్‌ అర్థం కావడంలేదని, లె క్చరర్‌ హోంవర్క్‌ ఎక్కువ ఇస్తున్నారని వేరే కళాశాలలో చేరుతానని చెబుతుండేవాడు. అన్నట్టుగానే ఐదు రోజుల క్రితం టీసీ తీసుకొని పట్టణ పరిధిలోని మోడల్‌ స్కూల్‌లో చేరాడు. 

స్టేటస్‌ పెట్టిన 10నిమిషాల్లోనే..: ‘నేను చనిపోవడానికి మా జూనియర్‌ కళాశాల మ్యాథ్స్‌ లెక్చరర్, తోటి విద్యార్థిని కారణం’అని ఆదివారం మధ్యాహ్నం 12.55కి తన మొబైల్‌ లో స్టేటస్‌ పెట్టాడు. అతని స్టేటస్‌ చూ సిన స్నేహితులు... ఆకాశ్‌రెడ్డి తల్లి అరుణకు చెప్పారు. అదే సమయంలో అక్కడి కి వచ్చిన ఆకాశ్‌ను ప్రశ్నించగా... సరదాగా పెట్టానంటూ వెళ్లిపోయాడు. అనంతరం సైకిల్‌పై గ్రామ సమీపంలోని వ్య వసాయ బావి వద్దకు వెళ్లాడు. రోడ్డు పక్కన సైకిల్, గట్టు పైన చెప్పులు,సెల్‌ఫోన్‌ పెట్టి బావిలో దూకాడు. అతని కోసం వెదుకుతుండగానే బావిలో దూకాడని గ్రామస్తులు చెప్పారు. 

భయంతోనేనా.. 
ఆకాశ్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుతున్న సమయంలో తోటి విద్యార్థిని ఫొటోలను తన ఫోన్‌లో వాట్సప్‌ డీపీగా పెట్టుకునే వాడు. కాలేజీ మారాక కూడా కొనసాగించాడు. దీంతో సదరు విద్యార్థిని మ్యాథ్స్‌ లెక్చరర్‌కు చెప్పింది. దీనిపై సోమవారం పోలీస్‌లకు ఫిర్యాదు చేద్దామని లెక్చరర్‌ చెప్పినట్లు సమాచారం. తనపై కేసు అవుతుందనే భయంతోనే బావిలోకి దూకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

అంతేకాక ఆకాశ్‌ మానసిక స్థితి కూడా సరిగా ఉండదని తెలిసింది. అతడి తండ్రి నోముల శ్రీనివాస్‌రెడ్డి మూడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. తల్లి అరుణ మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కాగా, బావిలో నీరు ఎక్కువగా ఉండడంతో పోలీసులు అర్ధరాత్రివరకు వెతికినా మృతదేహం దొరకలేదు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top