ఇదో రకం చీటింగ్‌: కొనక ముందు పుత్తడి.. కొన్నాక ఇత్తడి

Hyderabad: Three Arrested Cheating Travel Agent Chandrayanagutta - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ముగ్గురితో ఏర్పడిన అంతరాష్ట్ర ముఠా ఇత్తడిని పుత్తడిగా నమ్మించి అంటగట్టడం మొదలెట్టింది. ట్రావెల్‌ ఏజెంట్లు, వ్యాపారుల విజిటింగ్‌ కార్డ్స్‌ ఆధారంగా వాళ్లకు ఫోన్లు చేసి ఎర వేస్తోంది. పాతబస్తీకి చెందిన ఓ ట్రావెల్‌ ఏజెంట్‌ నుంచి రూ.17 లక్షలు కాజేసింది. ఈ ముఠా కోసం రంగంలోకి దిగిన చాంద్రాయణగుట్ట పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. వీరి నుంచి రూ.15 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.  

హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్‌ ఏజెంట్స్‌తో పరిచయం...తరువాత
► కర్ణాటక, ఏపీలోని సరిహద్దు ప్రాంతాలకు చెందిన శివయ్య (డ్రైవర్‌), తిరుపతయ్య (రైతు), బి.ఇంద్రాజు (డ్రైవర్‌) ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముగ్గురూ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటారు. ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్‌ ఏజెంట్స్‌తో పరిచయం ఏర్పరుచుకుని వారి నుంచి విజిటింగ్‌ కార్డ్స్‌ తీసుకుంటారు. ఆపై వారికి ఫోన్లు చేసి తమకు దొరికిన బంగారం తక్కువ ధరకు విక్రయిస్తామంటూ ఎర వేస్తారు.  
► చాంద్రాయణగుట్ట పరిధిలోని రాజీవ్‌ గాంధీనగర్‌కు చెందిన విజయ్‌కుమార్‌ కేఎల్‌ఏ లాజిస్టిక్స్‌ అండ్‌ బస్‌ టిక్కెట్స్‌ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నాడు. గత నెలలో ఈయన వద్దకు వచ్చిన ఈ త్రయం విమాన టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నారు. ఆ తర్వాతి రోజు మరోసారి వచ్చి ఆ టిక్కెట్‌ కేన్సిల్‌ చేసుకున్నారు. అలా ఆయనతో పరిచయం పెంచుకుని విజిటింగ్‌ కార్డు తీసుకున్నారు. గత నెల 9న విజయ్‌కుమార్‌కు కాల్‌ చేసిన ఈ ముఠా సభ్యులు తమకు బంగారం దొరికిందన్నారు. 
► మైసూర్‌ ప్రాంతంలో ఉన్న తమ పొలంలో తవ్వకాలు జరుపుతుండగా బంగారు ఆభరణాలతో కూడిన లంకె బిందెలు దొరికాయని, ఆ పసిడిని కేజీ రూ.17 లక్షలకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నామంటూ పేర్కొన్నారు. కావాలంటే మచ్చుకు కొంత ఇస్తామన్నారు.. ఇది జరిగిన నాలుగు రోజులకు బండ్లగూడ ప్రాంతంలో విజయకుమార్‌ను కలిసిన వాళ్లు ఇత్తడితో చేసి, పుత్తడి కోటింగ్‌ వేసిన ఆభరణం చూపించి నమ్మించారు. పథకం ప్రకారం ముందుగా వాటిలో ఉంచిన అసలు బంగారం ముక్కల్ని తీసి ఇచ్చారు.  
► వీటిని బంగారం దుకాణానికి తీసుకువెళ్లిన విజయ్‌కుమార్‌ పరీక్ష చేయించారు. ఆ సందర్భంలో ఇది నిజమైన బంగారమే అని తేలడంతో ఆయన పూర్తిగా నమ్మారు. ఆపై రూ.17 లక్షలు ఆ ముగ్గురికీ చెల్లించి కేజీ ‘బంగారం’ ఖరీదు చేశారు. 
► పది రోజుల తర్వాత కొత్తగా ఆభరణాలు చేయించుకోవడానికి వీటిని తీసుకుని బంగారం దుకాణానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అది పుత్తడి కాదని, ఇత్తడని తేలడంతో తాను మోసపోయానని బాధితుడు గుర్తించాడు. 
►   దీంతో ఆయన చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ కేఎన్‌ ప్రసాద్‌ వర్మ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగి ముగ్గురు నిందితులను గుర్తించి వారి నుంచి రూ.15 లక్షలు రికవరీ చేశారు.

( చదవండి: శ్వేతను బతికించండి )  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top