బనస్కాంత: గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో జరిగిన ఒక అమానవీయ ఘటన సమాజానికి తలవుంపులు తెచ్చింది. రూ. 50 వేల కోసం భార్యను స్నేహితులకు అమ్మేసి, ఆమెపై 10 రోజుల పాటు సామూహిక అత్యాచారం జరిగేలా చేసిన ఒక దుర్మార్గుడి ఉదంతం అందరినీ నివ్వెరపోయేలా చేస్తోంది.
మిస్సింగ్ డ్రామాతో..
మే 11న తన భార్య అదృశ్యమైందని పాలన్‌పూర్ పశ్చిమ పోలీస్ స్టేషన్‌లో సదరు భర్త ఫిర్యాదు చేశాడు. అయితే, రెండు రోజుల తరువాత అతను కూడా అదృశ్యం కావడంతో, అనుమానం వచ్చిన అతని తండ్రి పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు భర్త తీరుపై వారికి అనుమానం తలెత్తింది. దీంతో వారు ప్రణాళికతో దర్యప్తు నిర్వహించి, నిందితుని నోటి నుంచే నేరాన్ని కక్కించారు.
10 రోజుల నరకం
పోలీసులు నిందితుడిని, ఆ తర్వాత బాధితురాలిని గుర్తించి విచారించగా, విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. తన భార్యను స్నేహితులకు రూ. 50 వేలకు అమ్ముకున్నట్లు విచారణలో తెలిపాడు. ఆ పది రోజులు ఆమెను బందీని చేసి, పదేపదే లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా, ఆమె ఒంటిపై ఉన్న నగలను కూడా దోచుకుని అమ్మేసినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్యాచారం, మానవ అక్రమ రవాణా, నేరపూరిత కుట్ర వంటి తీవ్రమైన సెక్షన్ల కింద భర్తపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ప్రధాన సూత్రధారి అయిన భర్తతో సహా మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి గతంలో కూడా బాలికలను లోబర్చుకుని, కిడ్నాప్ చేసిన క్రిమినల్ చరిత్ర ఉందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జిగ్నేష్ గామిత్ తెలిపారు.


