తెల్లవారుజామున డూప్లెక్స్‌ ఇంట్లో షాకింగ్‌ ఘటన.. ముచ్చటైన కుటుంబం.. అంతలోనే

Father And Son Died Due To Electric Short Circuit In Anakapalle District - Sakshi

నర్సీపట్నం(అనకాపల్లి జిల్లా): ముచ్చటైన కుటుంబం వారిది.. అనుబంధాలు పెనవేసుకున్న వారి అందాల పొదరింటిలో ఆనందాల హరివిల్లు నిత్యం నాట్యం చేస్తుంది.. అందుకే విధికి కూడా కన్ను కుట్టింది.. వారి ఆశలను తుంచేస్తూ, కలల్ని కాల్చేస్తూ అగ్ని ప్రమాదం పొట్టన పెట్టుకుంది.. ఆదివారం తెల్లవారుజామున నిద్రలో ఉండగా షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగి ఊపిరాడక తండ్రీ కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రాణాలతో బయటపడ్డ తల్లీ కూతుళ్లు విశాఖ కేజీహెచ్‌లో విషమ స్థితిలో చికిత్స పొందుతున్నారు.

కార్తీక ఆదివారం త్రిమూర్తుల పూజ చేసుకోవడం వారికి ఆనవాయితీ. అందుకే విశాఖలో ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్న కుమారుడిని ముందు రోజే ఇంటికి రప్పించారు. శనివారం రాత్రి పొద్దుపోయేవరకు తల్లీ తండ్రీ, ఇద్దరు పిల్లలు హాయిగా కబుర్లు చెప్పుకున్నారు. నిద్రకు ఉపక్రమించాక వేకువజామున జరిగిన ప్రమాదం వారి కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. పట్టణంలోని కృష్ణాబజార్‌ సెంటర్లో ఈ ఘోరం జరిగింది.

బంగారు వ్యాపారి నవర మల్లేశ్వరరావు (నానాజీ) (45) అంబికా జ్యూయలర్స్‌ దుకాణం నిర్వహిస్తున్నారు. షాపుపైనే రెండంతస్తుల డూప్లెక్స్‌ ఇంట్లో భార్య సుజాత, ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నారు. కుమారుడు మౌలేష్‌ (19) విశాఖలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో రెండో సంవత్సరం, కుమార్తె జాహ్నవి మాకవరపాలెంలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నారు. శనివారం రాత్రి నానాజీ, భార్య సుజాత, కుమారుడు మౌలేష్‌ పైఅంతస్తులో పడుకున్నారు.

కుమార్తె జాహ్నవి కింద అంతస్తులో పడుకుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇల్లంతా దట్టమైన పొగతో ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఒకపక్క మంటలు, మరోపక్క పొగతో కారు చీకటిలో ఎటువెళ్లాలో తెలియక ఆందోళన చెందారు. “ఇంట్లో మంటలు వ్యాపించాయి.. రక్షించమ’ని నానాజీ పక్కింట్లో నివాసం ఉంటున్న సోదరుడు అప్పారావుకు ఫోన్‌ చేశారు. ఇల్లంతా తాళాలు వేసి ఉండడంతో సోదరుడు, అతని కుటుంబ సభ్యులకు కాపాడేందుకు అవకాశం లేకుండా పోయింది.

సుమారు 40 నిమిషాలపాటు నానాజీ రక్షించమని ఫోన్లో అరుస్తూనే ఉన్నా.. రెండంతస్తుల్లో ఉన్న నాలుగు గేట్లకు తాళాలు వేసి ఉండడంతో లోనికి ప్రవేశించలేకపోయారు. సోదరుడు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించగా వారు హుటాహుటిన చేరుకొని, గేట్ల తాళాలను కట్టర్‌తో పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. కింద అంతస్తులో అపస్మారకస్థితిలో పడి ఉన్న జాహ్నవిని స్థానికుల సాయంతో తాళ్లతో కొందకు దించారు.

ఆపై అంతస్తులో నానాజీ, సుజాత, మౌలేష్‌ కింద పడి ఉన్నారు. నానాజీ అప్పటికే మృతి చెందగా.. కొనఊపిరితో ఉన్న మౌలేష్‌ను తాళ్లతో కిందకు దించుతుండగా మరణించాడు. పరిస్థితి విషమంగా ఉన్న సుజాతను, కుమార్తె జాహ్నివిని తొలుత ఏరియా ఆస్పత్రికి, ఆ తర్వాత విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. డీఎస్పీ ప్రవీణ్‌కుమార్, సీఐ గణేష్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగిందని విద్యుత్‌ శాఖ అధికారులు ధ్రువీకరించారు.
చదవండి: బావతో వివాహేతర సంబంధం.. దుబాయ్‌ నుంచి భర్త రావడంతో..   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top