వాట్సాప్‌ మెసేజ్‌: తమ్ముడ్ని జాగ్రత్తగా చూసుకో అమ్మా, నన్ను క్షమించమ్మా..

Engineering Student Missing in Tallarevu East Godavari - Sakshi

తాళ్లరేవు (తూర్పుగోదావరి):  చదువు తనకు భారంగా మారిందని, ఇక తాను చదవలేనని, చచ్చిపోతానంటూ ఒక విద్యార్థి తల్లిదండ్రులకు పంపిన వాట్సాప్‌ ఆడియో మెసేజ్‌ తోటి విద్యార్థులను తీవ్ర కలవరానికి గురిచేసింది. కోరంగి పోలీసులు, తోటి విద్యార్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా కావటి మండలం, గొనపకుత్తిక గ్రామానికి చెందిన లొల్ల సాయిచరణ్‌ కోరంగి కైట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు.

కళాశాల హాస్టల్‌లో ఉంటున్న సాయిచరణ్‌ ఆదివారం ఉదయం ఎన్‌సీసీ కటింగ్‌ చేయించుకునేందుకు బార్బర్‌ షాపునకు వెళ్లి వస్తానని చెప్పి అనుమతి తీసుకుని బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కొద్దిసేపటి అనంతరం సాయిచరణ్‌ తల్లిదండ్రులు కళాశాల ప్రతినిధులకు ఫోన్‌ చేశారు. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయని, ఇప్పటివరకు ఎలాగో చదివానని ఇకపై తాను చదవలేకపోతున్నానని, తమ్ముడ్ని జాగ్రత్తగా చూసుకో అమ్మా, నన్ను క్షమించమ్మా అంటూ విలపిస్తూ వాట్సాప్‌లో ఆడియో మెసేజ్‌ చేశాడని చాలా ఆందోళనగా ఉందని తెలిపారు. తక్షణమే స్పందించిన కళాశాల ప్రతినిధులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు.

చదవండి: ('ఎంత రాత్రయినా వస్తానని చెప్పి అటే వెళ్లిపోయారు')

పలువురు విద్యార్థులు కోరంగి, తాళ్లరేవు, యానాం పరిసర ప్రాంతాల్లో సాయిచరణ్‌ ఆచూకీ కోసం గాలించారు. ఫలితం లేదు. కళాశాల హాస్టల్‌ వార్డెన్‌ కృష్ణ, సాయిచరణ్‌ తండ్రి షణ్ముఖరావు కోరంగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కోరంగి హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాయిచరణ్‌కు బ్యాక్‌ల్యాగ్స్‌ కేవలం రెండే ఉన్నాయని, క్రీడలతోపాటు ఎన్‌సీసీ వంటి వాటిలో చాలా చురుకుగా ఉండేవాడని కళాశాల ప్రతినిధులు, తోటి విద్యార్థులు తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top