
కర్నాటకలో మహిళ దారుణ హత్య
పచ్చబొట్టు ఆధారంగా మృతురాలి గుర్తింపు
హంతకుడి కోసం పోలీసుల గాలింపు
బెంగళూరు: 2022నాటి శ్రద్ధా వాకర్ దారుణ హత్యను తలపించే ఘటన ఒకటి కర్నాటకలో వెలుగు చూసింది. ఈ నెల 7వ తేదీన కొరటగెరె తాలుకాలోని ఓ గ్రామంలో వీధి కుక్క ఒకటి రక్తమోడుతున్న మనిషి చేతిని లాక్కెళుతుండగా చూసి షాక్‌కు గురయ్యారు. మరో చేయి అక్కడికి కిలోమీటర్ దూరంలో గ్రామస్తులకు కనిపించింది. గుర్తు తెలియని మహిళ తల, మొండెం తదితర భాగాలు పది వేర్వేరు ప్రాంతాల్లో పడి ఉండగా గుర్తించారు. సాధారణంగా చోటుచేసుకునే హత్య వంటిది కాదని తేలి్చన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా మృతురాలిని గుర్తించారు. హంతకుడిని పట్టుకునే పనిలో ఉన్నారు.
10 చోట్ల 10 భాగాలు..
ఈ నెల 7వ తేదీ గురువారం ఉదయం చింపుగనహళ్లి గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయం సమీపంలో రోడ్డు పక్కన కుక్క ఒకటి మనిషి తెగిన చేతిని పొదల్లోకి లాక్కెళ్తుండగా స్థానికులు గమనించారు. ప్లాస్టిక్ కవర్‌లో చుట్టిన మరో చేయి ఆ సమీపంలోనే వారికి కనిపించింది. మరికొద్ది గంటల వ్యవధిలోనే వివిధ ప్రాంతాల్లో మరికొన్ని అవయవ భాగాలు కనిపించాయి. లింగపుర రోడ్డు వంతెన వద్ద పేగులు, ఇతర అంతర్గత భాగాలు బెండోన్ నర్సరీకి సమీపంలో, ఒక కాలు రక్తంతో తడిచిన బ్యాగు జోనిగరహళ్లి వద్ద పోలీసులకు దొరికాయి.
సిద్దారబెట్ట, నాగాలాల్ మధ్య రోడ్డుపై రెండు బ్యాగుల్లో మరికొన్ని శరీర భాగాలను గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం సిద్దారబెట్ట సమీపంలో హతురాలి తల లభ్యమైంది. శరీర భాగాలన్నీకొరటగెరె, కొలాల పోలీస్ స్టేషన్ల పరిధిలోని మొత్తం 10 ప్రాంతాల్లో పడి ఉండగా స్వా«దీనం చేసుకున్నారు పోలీసులు. హతురాలి చేతులపై ఉన్న పచ్చబొట్లు, ముఖకవళికల ఆధారంగా ఆమెను తుమకూరు తాలుకా బెళ్లావికి చెందిన లక్ష్మీదేవమ్మ(42)అని గుర్తించారు.
ఆగస్ట్ 3వ తేదీన ఉర్దిగెరెలో ఉన్న కుమార్తెను చూసేందుకని వెళ్లిన లక్ష్మీదేవమ్మ కనిపించకుండా పోయిందంటూ ఆమె భర్త బెళ్లావి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం ఆమెను హత్య చేసి, ముక్కలుగా నరికారని, ఆమె ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకే హంతకులు పలు ప్రాంతాల్లో శరీర భాగాలను పడేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దారుణ హత్యకు పాల్పడిందెవరు? కారణాలేమిటో తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. 2022లో ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే యువతిని ఆమె బాయ్‌ఫ్రెండ్ ముక్కలుగా నరికి అటవీ ప్రాంతంలో పడేసిన ఘటన తీవ్ర సంచలనం రేపడం తెల్సిందే.