
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): పలుచోట్ల వైవాహిక సంబంధాలు పక్కదారులు పట్టి అవహేళనకు గురవుతున్నాయి. భార్య, లేదంటే భర్త పరాయి మోజులో పడి హత్యలకు వెనుకాడడం లేదు. ఇలా కుటుంబాలు వీధిన కూడా పడుతున్నాయి. ఆరు నెలల గర్భిణి అయిన భార్యను హతమార్చిన లాయర్.. ప్రమాదంలో చనిపోయిందని ప్రచారం చేసుకున్నాడు. దృశ్యం సినిమాను తలపించే ఈ హత్యోదంతం బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా ఉగార్ బీకే గ్రామంలో చోటుచేసుకుంది. చైతాలి (23)ని ఆమె భర్త ప్రదీప్ (28) హత్య చేశాడు.
కారు యాక్సిడెంట్ అని..
జిల్లా ఎస్పీ భీమాశంకర్ గుళేద్ తెలిపిన వివరాల మేరకు... 7వ తేదీ రాత్రి ప్రదీప్ కాగవాడ పోలీస్‌స్టేషన్‌కి ఫోన్ చేసి తమ కారుకు యాక్సిడెంట్ జరిగిందని, భార్య చైతాలి చావుబతుకుల మధ్య ఉందని, వెంటనే రావాలని, భార్యను కాగవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసికెళ్తున్నానంటూ చెప్పాడు. పోలీసులు ఆ ఆస్పత్రికి వెళ్లి చూడగా అక్కడ ఎవరూ లేరు. ప్రదీప్‌కి ఫోన్ చేయగా తన భార్యను మహారాష్టలోని మీరజ్ ఆస్పత్రికి తీసుకువచ్చానని, అయితే చనిపోయిందని చెప్పాడు. అందరికీ అదే మాట చెప్పసాగాడు. అతని తీరు మీద పోలీసులకు అనుమానం వచ్చింది. ప్రమాదస్థలికి వెళ్లి చూడగా ఎలాంటి ఘటన జరగలేదని తేలింది.
ప్రియురాలి కోసమే
దీంతో పోలీసులు ప్రదీప్, అతని మిత్రులు సద్దాం అక్బర్ ఇమాందార్, రాజన్ గణపతి కాంబ్లేను తమదైన శైలిలో విచారించగా అసలు నిజం కక్కారు. ప్రదీప్, చైతాలిది ప్రేమ వివాహం. అయితే ప్రదీప్‌కి ఇటీవల మరో యువతితో çసంబంధం ఏర్పడింది. భార్య చైతాలిని అడ్డు తొలగించుకోవాలని కారులో తీసికెళ్లి తలపై కొట్టి హత్య చేశాడు. ఇందుకు స్నేహితులు సహకరించారు. తరువాత మృతదేహాన్ని తరలించి యాక్సిడెంట్ అని ప్రచారం చేశారు. పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేశారు.