
పడకగది వీడియోలు స్నేహితులకు పంపి వికృతానందం
వివాహేతర సంబంధాలు పెట్టుకోవాలని భార్యకు వేధింపులు
అత్తమామలు, ఆడపడుచు, ఆమె భర్త కూడా భాగస్తులే
బెంగళూరులో వెలుగు చూసిన ఘటన
కర్ణాటక: ఓ వికృత భర్త నిజ స్వరూపాన్ని చూసి భార్య నిశ్చేష్టురాలైంది. పడక గదిలో రహస్యంగా కెమెరాలను అమర్చి భార్యతో సన్నిహితంగా వీడియోలను తీసుకున్న భర్త వాటిని స్నేహితులకు పం పించి పైశాచికానందం పొందాడు. సభ్య సమాజాన్ని విస్తుగొలిపే ఈ ఘటన సిలికాన్ సిటీ బెంగళూరులో శుక్రవారం వెలుగుచూసింది. బాధితురాలు, పుట్టేనహళ్లి పోలీసుల కథనం ప్రకారం..
బెంగళూరుకు చెందిన సయ్యద్ ఇనాముల్ గతంలో పెళ్లయిం ది. కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి గతసెప్టెంబర్ బాధిత యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వ్యాపారం చేస్తానని, ఆస్తిపరుడిని అని చెప్పుకున్నాడు. 350 గ్రాముల బంగారం, ఓ ఖరీదైన బైకు కట్నంగా తీసుకున్నాడు. తొలిరోజు నుంచే భార్యను వేధించడం ప్రారంభించాడు. తనకు 19మంది మహిళలతో సంబంధాలున్నట్లు గొప్పలు చెప్పుకునేవాడు. బెడ్ రూంలో కెమెరాలను ఏర్పాటు చేసి భార్యతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను రికార్డ్ చేసేవాడు.
ఆ వీడియోలను దుబాయ్‌లోని తన స్నేహితులకు పంపేవాడు. వారితో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని భార్యపై ఒత్తిడి చేసేవాడు. భర్తకు అత్తమామలు, ఆడపడుచు, ఆమె భర్త సహకరించేవారు, వారూ వేధించేవారు. బయట సినిమాలు, పార్కులకు వెళ్లినప్పుడు కూడా సయ్యద్ భార్యను అవమానించేవాడు. దీంతో విసిగివేసారిన బాధితురాలు పుట్టేనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు విచారణలో సయ్యద్ భార్య ఆరోపణలు నిజమేనని అంగీకరించడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి ఫోన్, కంప్యూటర్ సీజ్ చేశారు.