హెర్బల్‌ ఆయిల్‌ పేరుతో రూ. 52 లక్షలకు టోకరా 

Cyber Fraudsters Extorted Rs 52 Lakhs From Person By Herbal Oil Product - Sakshi

సాక్షి, సిటీబ్యూరో : హెర్బల్‌ ఆయిల్‌ సరఫరా చేస్తామంటూ హైదరాబాద్‌కు చెందిన ఒకరి నుండి సైబర్‌ మోసగాళ్లు రూ. 52 లక్షలు స్వాహా చేశారు. ఎస్‌ఆర్‌ నగర్‌ పరిధిలో ఈ సంఘటన జరిగింది. కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన కె. కొండల్‌ రెడ్డి వీఎస్‌ఏ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను నిర్వహిస్తున్నారు. వివిధ సంస్థలను అవసరమైన సామగ్రిని సరఫరా చేసేవాడు. ఆయనకు ఆన్‌లైన్‌ ద్వారా జుమాక్‌ ఫార్మాస్యుటికల్స్‌ ప్రతినిధిగా చెప్పుకున్న జాన్‌ డానియల్‌తో పరిచయం ఏర్పడింది.

ఆక్సోనో హెర్బల్‌ ఆయిల్‌ లిక్విడ్‌ కావాలని అతను కొండల్‌రెడ్డిని కోరాడు. అయితే జుమాక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా చెప్పుకున్న మరో వ్యక్తితో లావాదేవీలు నిర్వహించిన కొండల్‌ రెడ్డి సదరు ఆయిల్‌ కొటేషన్‌ను అతనికి పంపాడు. తర్వాత వారు తమకు తొలివిడతగా 500 లీటర్ల ఆక్సోనో హెర్బల్‌ ఆయిల్‌ కావాలని కొండల్‌రెడ్డికి ఆర్డర్‌ చేశాడు. జుమాక్‌ సంస్థ ప్రతినిధులు సూచించిన విధంగా ఈ ఆయిల్‌ కోసం కొండల్‌ రెడ్డి మణిపూర్‌లోని ఆర్‌కే ఎంటర్‌ప్రైజెస్‌ ప్రతినిధిగా చెప్పుకున్న రాకేష్‌ కుమార్‌ను సంప్రదించారు. ఆయిల్‌ సరఫరా కోసం రూ. 42.63 లక్షలను రాకేష్‌ చెప్పిన ఖాతాలకు పంపాడు.

అయినా వారు ఆయిల్‌ను పంపలేదు. ఈలోగా ఆర్‌కే ఎంటర్‌ప్రైజెస్‌ ప్రతినిధిగా చెప్పకున్న హరిప్రీత్‌... కొండల్‌ రెడ్డికి ఫోన్‌ చేసి మరో రూ. 10 లక్షలు పంపాలని లేని పక్షంలో ఆర్డర్‌ క్యాన్సిల్‌ అవుతుందని చెప్పాడు. దీంతో వారు చెప్పినట్టుగానే రూ.10 లక్షలు పంపినా ఆయిల్‌ రాకపోగా... ఆర్‌కే ఎంటర్‌ప్రైజెస్‌ ప్రతినిధిలుగా చెప్పుకున్న రాకేష్‌ కుమార్, హరిప్రీత్‌ల ఫోన్లు స్విచాఫ్‌ అయ్యాయి. మోసపోయానని గ్రహించిన బాధితుడు కొండల్‌రెడ్డి మంగళవారం ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ అజయ్‌కుమార్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top