బీమా పాలసీకి బోనస్‌గా బొగ్గు గని షేర్లంటూ రూ.కోటి స్వాహా!

Cyber Crime Fraud Coal Mine Shares as Bonus To The Insurance Policy - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: బీమా పాలసీకి బోనస్‌గా బొగ్గు గనికి సంబంధించిన షేర్లు ఇస్తామంటూ హైదరాబాద్‌వాసికి ఎర వేసిన సైబర్‌ నేరగాళ్లు రూ.కోటి కొట్టేశారు. ఆరేళ్ల పాటు సాగిన ఈ దోపిడీపై ఎట్టకేలకు బాధితుడు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

నగరంలోని ఆగాపూరకు చెందిన వ్యక్తి కొన్నేళ్లు అసోంలోని గౌహతిలో ఉన్నాడు. 2015లో ఇతడికి చేసి ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌గా పరిచయం చేసుకున్న సైబర్‌ నేరగాళ్లు పాలసీ పేరు చెప్పారు. తమ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకుంటే రూ.80 లక్షల విలువైన కోల్‌మైన్‌ షేర్లు ఇస్తామంటూ ఎర వేశారు. అతి తక్కువ కాలంలోనే వాటి విలువ రూ.కోట్లకు చేరుతుందని నమ్మబలికారు. తొలుత ఇన్సూరెన్స్‌ పాలసీతో పాటు వివిధ పేర్లు చెప్పి రూ.20 లక్షలు కాజేశారు. 

ఆపై షేర్స్‌ కేటాయింపు కోసమంటూ కొన్ని పత్రాలు ఆయనకు పంపారు. వీటిని తిరిగి పొందిన తర్వాత ఓసారి ఫోన్‌ చేసి షేర్‌ విలువ భారీగా పెరిగిందని చెప్పారు. ఆ డబ్బును ఎన్‌క్యాష్‌ చేసుకోవడానికి కొన్ని పన్నులు చెల్లించాలంటూ చెప్పి భారీ మొత్తం స్వాహా చేశారు. ఆరేళ్ల కాలంలో మొత్తం రూ.కోటి స్వాహా చేశారు. మరికొన్ని పన్నుల పేరుతో ఇంకా డబ్బు చెల్లించాలని చెప్తుండటంతో అనుమానం వచ్చిన బాధితులు శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేస్తోంది.   
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top