మా అమ్మ జ్ఞాపకాలను కొట్టేశారు

Coronavirus Patient Gold Threaft Case File in Hyderabad - Sakshi

కరోనాతో మృతి చెందిన మహిళ ఒంటిపై నగలు మాయం 

పోలీసులకు మృతురాలి కుమారుడి ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌: ఆ ఇంట్లో ఓపెద్దావిడకు కరోనా సోకింది. బాధితురాలిని ఆసుపత్రిలో చేర్చుకున్న వైద్యులు ఆమె కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచించారు. అయితే మూడు రోజుల అనంతరం ఆమె మృతి చెందిందని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ పరిస్థితుల్లో అంత్యక్రియలు కూడా ఆస్పత్రి వారే చేయాలని కుటుంబ సభ్యులు చెప్పడంతో అంత్యక్రియలు చేశారు. అయితే సదరు మహిళ చెవి కమ్మలు, బంగారు ఉంగరం, మెడలోని గొలుసు మాయమయ్యాయి. అవెక్కడని కుటుంబ సభ్యులు నిలదీయగా ఆస్పత్రి వర్గాలు నోరెళ్లబెట్టాయి. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి...

కోఠి, గిరిరాజ్‌ లేన్‌లో ఉంటున్న ఇందిరాదేవి(73) కరోనా బారిన పడటంతో ఈ నెల 23న బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని సెంచురీ ఆస్పత్రిలో చేర్చారు. ఆమెకు పాజిటివ్‌ వచ్చినందున కుటుంబ సభ్యులను ఎవరినీ ఆస్పత్రికి రావొద్దని ఇంట్లోనే సెల్ఫ్‌ క్వారంటైన్‌ కావా లని వైద్యులు సూచించారు. దీంతో ఇందిరాదేవి కుమారుడు ప్రకాశ్‌ బెల్దెతో పాటు కుటుంబ సభ్యులంతా క్వారంటైన్‌లో ఉన్నారు. కాగా ఇందిరాదేవి చికిత్స పొందుతూ ఈ నెల 25న మృతి చెందిందని వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అంత్యక్రియలు కూడా ఆస్పత్రి వారే చేయాలని చెప్పడంతో అందుకు అంగీకరించారు. అంత్యక్రియలను వీడియో కాల్‌ ద్వారా కుటుంబ సభ్యులు వీక్షించారు.

ఆస్పత్రిలో చేర్పించే సమయంలో ఇందిరాదేవి చెవికి వజ్రాలు పొదిగిన కమ్మలతో పాటు, వేలికి ఉంగరం, మెడలో గొలుసు ఉండాలని ఆమె చనిపోయిన తర్వాత అవి కనిపించలేదని కుమారుడు ఉదయ్‌ ప్రకాశ్‌ ఆస్పత్రి యాజమాన్యాన్ని నిలదీయగా, ఆస్పత్రిలో చేరేటప్పుడు ఆభరణాలు ఉన్నాయని అవి ఎలా పోయాయో తాము విచారణ చేస్తామని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. తమ తల్లి జ్ఞాపకాలను తస్కరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రకాశ్‌ బెల్దె బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top